సిద్ధూకు సంకటం

2

న్యూఢిల్లీ,ఆగస్టు 19(జనంసాక్షి): క్రికెట్‌లో బాగా ఆరితేరిన మాజీ క్రికెటర్‌ సిద్ధూ రాజకీయాల్లో గుగ్లీలు వేస్తూ ఆయా పార్టీలను గందరగోళంలొ పడేశారు. ఆయన లక్ష్యం ఏంటన్నది పైకి చెప్పకుండా బిజెపి నుంచి మాత్రం బయటకు వచ్చారు. అయితే ఆమ్‌ ఆద్మీ,కాంగ్రెస్‌ల నుంచి ఆఫర్లు వచ్చి పడుతున్న వెంటేనే ఒప్పుకోకుండా ఆచితూచి ఆటాడుతున్నారు. ఇదంతా తాను పంజాబ్‌ సిఎం కావడమెలా అన్న చదరంగ ఆటను తలపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి మళ్లీ పిలిచి సిఎం సీటు కట్టబెట్టాలని చూస్తున్నట్లు తాజా పంజాబ్‌ పరిస్థితులను చూస్తే అర్థం చేసుకోవచ్చు. పంజాబ్‌ సిఎం అభ్యర్థిగా సిద్దూపు ప్రకటిస్తే మళ్లీ బిజెపి గూటికి చేరవచ్చని ఆయనను దగ్గరినుంచి ఊస్తున్న వారు వెల్లడిస్తున్నారు. అందుకే సిద్దే ఆప్‌, కాంగ్రెస్‌ ఇచ్చే ఆఫర్లను పట్టించుకోవడం లేదు. అలాగని తిరస్కరించడం లేదు. ఏవిూ మాట్లాడకుండా తనమదిలోనే పావులుకదుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. బిజెపి కూడా పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోంది. మరోవైపు సిద్దూ రాజీనామా చేయగానే ఆప్‌లో చేరుతారని ప్రచారం సాగింది. అయితే ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరతారా లేదా అన్న అంశంపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ విషయమై దిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆప్‌లో సిద్ధూ చేరికపై ఎన్నో వార్తలు వింటున్నాను. దీనిపై స్పందించాల్సిన బాధ్యత నాపై ఉంది.సిద్ధూలాంటి లెజెండరీ క్రికెటర్‌ మా పార్టీలో చేరితే మాకెంతో గర్వకారణం. గత వారమే ఆయన నన్ను కలిశారు. ఈ విషయమై ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని అడిగారు. ఆయన నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత మాపై ఉంది.’ అని పేర్కొన్నారు. సిద్ధూ చాలా మంచి వ్యక్తి…ఆయన మా పార్టీలో చేరినా చేరకపోయినా ఆయనపట్ల గౌరవం ఎప్పటికీ మారదు అని ట్విట్టర్‌ ద్వారా కేజీవ్రాల్‌

తెలిపారు. ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరిక విషయంలో సందిగ్ధంలో పడిన మాజీ క్రికెటర్‌ సిద్ధూకి కాంగ్రెస్‌ పార్టీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది. పంజాబ్‌ ఎన్నికల్లో తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు, తన భార్యకూ టికెట్‌ కేటాయించాలన్న సిద్ధూ కోరికను ఆప్‌ తిరస్కరించిందన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్‌ తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడంతో పాటు సిద్ధూ ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచినట్లు సమాచారం. అటు భాజపాకు, రాజ్యసభ అభ్యర్థిత్వానికి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్‌ సిద్ధూ ఆప్‌లో చేరుతారన్న వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేతతో నేతలతో చర్చలు కూడా జరిగాయి. సీఎం అభ్యర్థిత్వంతో పాటు, తన భార్య నవజ్యోత్‌కౌర్‌కు టికెట్‌ కేటాయించాలన్న సిద్ధూ కోరికను ఆప్‌ తిరస్కరించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇద్దరికి టికెట్‌ ఇచ్చే సంప్రదాయం తమ పార్టీలో లేదని చెప్పడంతో పాటు సీఎం అభ్యర్థిత్వం విషయంలోనూ ససేమిరా అంది. దీంతో సిద్ధూ సందిగ్ధంలో పడ్డారు. అయితే, గత కొంతకాలంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్న కాంగ్రెస్‌ తాజా పరిణామాల నేపథ్యంలో సిద్ధూను ఎలాగైనా పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆప్‌ వంటి సంప్రదాయాలు తమ పార్టీలో లేవని, సిద్ధూ కోరినట్లు ఇద్దరికీ టికెట్లు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు సమాచారం. అయితే, సిద్ధూ కోరినట్లుగా సీఎం అభ్యర్థిగా ప్రకటించేది లేదు కానీ రెండుమూడేళ్లలో డిప్యూటీ సీఎం పదవిని మాత్రం ఇస్తామని చెప్పినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్‌ ఆఫర్‌ను సిద్ధూ స్వీకరిస్తారా? తిరస్కరిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే! ఈ నేపథ్యంతో సిద్దూ తనకుతానుగా అడగకుండా సిఎం అభ్యర్థిగా బిజెపి పిలుస్తుందని భావిస్తున్నారు. అలా చేసేందుకు బిజెపి సిద్దంగా ఉందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.