సిరియాలో సివిల్‌వార్‌

ప్రధాని కాన్వాయ్‌పై బాంబుదాడి
త్రుటిలో తప్పించుకున్న హల్కీ
బీరుట్‌, (జనంసాక్షి) :
సిరియా ప్రధాని వేల్‌ అల్‌ హల్కీ లక్ష్యంగా సోమవారం ఉదయం బాంబు పేల్చారు. ఆయన పేలుడు నుంచి త్రుటిలో తప్పిం చుకున్నట్లు ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. డమాస్కస్‌లోని మెజ్జీ ప్రాంతంలో హల్కీ కాన్వాయ్‌ లక్ష్యంగా దాడి జరిగింది. ప్రధాని హల్కీ వెంట ఉన్న ఓ వ్యక్తి ఈ దాడిలో మరణించాడని, పలువురు గాయపడ్డారని సిరియా మానవ హక్కుల సంస్థ ఒకటి  వెల్లడించింది. ఘటన తర్వాత ప్రధాని యథావిధిగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారని అధికారవర్గాలు ఓ వీడియో టేపును రిలీజ్‌ చేశాయి. ఆ వీడియో ఓ మీడియా చానెల్‌ సైతం ప్రసారం చేసింది. సిరియాలో అంతర్గత కుమ్ములాటలు నానాటికీ పెరిగిపోతున్నాయి. మధ్య డమాస్కస్‌లోని మిజ్జే ప్రాంతంలో ప్రభుత్వ మిలటరీ సంస్థలు ఉన్నాయి. భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో బాంబుదాడి జరగడంతో ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో చాలావాటిపై పట్టుకోల్పోతున్నారు. దక్షిణ ప్రావెన్స్‌ డెర్రా, డమాస్కస్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ బలగాలతో తిరుగుబాటుదారులు హోరాహోరీగా తలపడుతున్నారు. సిరియా ఆందోళనల్లో ఇప్పటి వరకు 70 వేల మంది మరణించినట్లు ఐక్య రాజ్య సమితి ఒక నివేదికలో పేర్కొంది.