‘సిరివెన్నెల’కు నివాళిగా ‘నువ్వే నువ్వే’ను అంకితం ఇస్తున్నాం – చిత్ర దర్శక నిర్మాతలు త్రివిక్రమ్, ‘స్రవంతి’ రవికిశోర్

 

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా  పరిచయం చేస్తూ… ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, శిల్పా చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సోమవారానికి సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏఎంబీ సినిమాస్‌లో స్పెషల్ షో వేశారు. ఈ ప్రదర్శనకు చిత్ర బృందం హాజరయ్యారు.

త్రివిక్రమ్ మాట్లాడుతూ ”వనమాలి హౌస్‌లో ‘నువ్వే కావాలి’ షూటింగ్  జరుగుతుంది. రవికిశోర్ గారు, నేను పక్కన ఖాళీ స్థలంలో నడుస్తూ మాటల మధ్యలో కథ చెప్పా. ఆయన చెక్ బుక్ తీసి ఒక అమౌంట్ వేసి ఇచ్చారు. ‘నువ్వే కావాలి’కి రైటర్‌గా ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో… దాదాపుగా అంత అమౌంట్ అడ్వాన్స్‌గా ఇచ్చారు. నేను దాంతో బైక్ కొనుక్కున్నాను. అప్పటికి నేను రాసిన ‘నువ్వే కావాలి’ షూటింగ్‌లో ఉంది. నేను ఏం చేయగలనో తెలియదు. కానీ, నేను చెప్పిన కథ విని రవికిశోర్ గారు ఎంతో నమ్మారు. ఆయనకు నేను ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా సరిపోదు.

మద్రాసులో ‘నీరం’ చూసి అందులో సన్నివేశాలను నా ఇష్టం వచ్చినట్లు ఎలా మార్చేయాలో చెబుతుంటే విన్న రవికిశోర్ గారు… ‘స్వయం వరం’ రాసిన తర్వాత నన్ను ఎవరూ పిలవకపోతే నేను భీమవరం వెళ్లి క్రికెట్ ఆడుకుంటుంటే మా ఇంటి పక్కన ఎస్‌టీడీ బూత్ నంబర్ కనుక్కుని నాకు ఫోన్ చేసిన రవికిశోర్ గారు… ‘నువ్వు నాకు నచ్చావ్’ కథను మీరు అనుకున్న హీరోకి కాకుండా పెద్ద హీరోకి చెబుతానని వాదిస్తే ‘నీ ఇష్టం వచ్చినట్టు చావు’ అని ప్రోత్సహించిన రవికిశోర్ గారు… రాత్రిపూట స్క్రిప్ట్ చదివి నేను రాసిన డైలాగ్ నచ్చితే ఫోన్ చేసి ఏడ్చిన రవికిశోర్ గారు… నేను పంజాగుట్టలో ఉన్నప్పుడు మా రూమ్ దగ్గరకు వచ్చి కింద నుంచి హారన్ కొట్టి పిలిచే రవికిశోర్ గారు… ఆయనకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలి? రసికుడు కానివాడికి కవిత్వం నివేదించే దరిద్రం నా నుదుటి మీద రాయొద్దని కాళిదాసు చెప్పాడు. నేను రాసిన మాటలు వినే రసికుడిని నాకు ప్రదర్శించినందుకు దేవుడికి నేను ఎన్నిసార్లు కృతఙ్ఞతలు చెప్పాలి!

‘నువ్వే నువ్వే’ కోసం ఢిల్లీకి వెళ్లి శ్రియ‌తో పాటు వాళ్ళ అమ్మకు కథ చెప్పడం నుంచి శ్రీనగర్ కాలనీలో రవికిశోర్ గారి ఆఫీసులో అందరికీ స్క్రిప్ట్ రీడింగ్ ఇవ్వడం నుంచి ప్రకాశ్ రాజ్ గారి ఇంటికి వెళ్లడం, ఊటీలో షూటింగ్ చేయడం… ప్రతిదీ ఇప్పటికీ గుర్తు. ‘నువ్వే నువ్వే’ షూటింగ్‌లో ఫైట్ మాస్టర్ లేకపోతే తరుణ్ చేత ఒక కిక్ కొట్టించే సీన్ చేశా. అప్పుడు నాలో వయలెన్స్ ఉందని అర్థమైంది. ‘అతడు’ తీసిన తర్వాత వెంకటేష్ గారు ‘నువ్వు చూస్తే సాఫ్ట్ గా ఉంటావ్. సినిమా వైలెంట్ గా తీశావ్’ అన్నారు. ఆ వయలెన్స్ ‘నువ్వే నువ్వే’లో కిక్ తో స్టార్ట్ అయ్యింది.

నాలో ఉన్న రచయితను గానీ… దర్శకుడిని గానీ… నాకంటే ఎక్కువగా గుర్తించిన, ఇష్టపడ్డ వ్యక్తి రవికిశోర్ గారు. ఆయన్ను నేను చాలా ప్రేమిస్తా. గౌరవిస్తా. రవికిశోర్ గారు అనడమే వచ్చు. నాకు ఆయన అన్నలాగా! ఆయనకు, సీతారామశాస్త్రి గారి మధ్య ఉన్న లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ ఇంకెవరి మధ్య చూడలేదు. అందుకు నేను సాక్షిని. ‘గాలిపటం గగనానిదా? ఎగరేసే నేలదా?’ అని రాసిన శాస్త్రి గారి గురించి నేను ఏం చెప్పగలను! ఆయన మాటల్లో చెప్పాలంటే… ‘ఆయన ఉఛ్వాసం కమలం. ఆయన నిశ్వాసం గానం. ఆయన జ్ఞాపకం మన అందరికీ ఎప్పటికీ అమరం’. అటువంటి సీతారామశాస్త్రి గారి దివ్య స్మృతికి ఆయన పాదాల దగ్గర ఈ సినిమాను రవికిశోర్ గారు, నేను, మా చిత్ర బృందం నివాళిగా అర్పిస్తున్నాం” అని అన్నారు.దర్శకుడిగా తనను పరిచయం చేసిన ‘స్రవంతి’ రవికిశోర్ పాదాలకు ఈ సందర్భంగా త్రివిక్రమ్ నమస్కరించారు.

‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ”నాకు ‘నువ్వే కావాలి’ సినిమా టైమ్‌లో త్రివిక్రమ్ కథ చెప్పాడు. కథంతా రెడీగా ఉంది. సినిమా తీయడమే ఆలస్యం అనుకున్నాం. 2002లో స్టార్ట్ చేసి విడుదల చేశాం. త్రివిక్రమ్ కథ చెప్పినప్పుడు ఇందులో తండ్రి పాత్ర ప్రకాశ్ రాజ్ మాత్రమే చేయాలని అతడిని ఫిక్స్ చేశాం. ఆయన చెప్పినట్లు ‘నువ్వు నాకు నచ్చావ్’ షూటింగ్ టైమ్‌లో ఆయన మీద బ్యాన్ ఉంది. ప్రకాశ్ రాజ్ కోసం పదిహేడు రోజులు ఇతర సన్నివేశాలు తీశాం. ఆయన తప్పితే ఆ సన్నివేశాలకు ఎవరూ ప్రాణం పోయలేరు. ‘నువ్వే నువ్వే’లో కూడా అంతే! ఆయన అద్భుతంగా నటించారు. వండ‌ర్‌ఫుల్‌ కాస్ట్ అండ్ క్రూ ఈ చిత్రానికి కుదిరింది. నేను త్రివిక్రమ్ గురించి చెప్పడం కరెక్ట్ కాదు. అతనొక వండర్. మేజిక్ క్రియేట్ చేస్తాడు. ఇక, నేను రాముడు అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారు లేకపోవడం… ఆయనతో నాకున్న అనుబంధం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. సుమారు 80 నుంచి 90 పాటలకు అసోసియేట్ అయ్యాం. చాలా పాటలకు రాత్రుళ్ళు కూర్చున్నాం. నా కళ్ళలోకి చూసి నచ్చిందో లేదో చెప్పేవారు. త్రివిక్రమ్ చెప్పినట్లు ‘నువ్వే నువ్వే’ను ఆయనకు అంకితం ఇస్తున్నాం” అని అన్నారు.

తరుణ్ మాట్లాడుతూ ”సినిమా విడుదలై 20 ఏళ్ళు అయినా… ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్టు ఉంది. నాకు బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్ లో సినిమా చూస్తా. నన్ను ‘నువ్వే కావాలి’తో రామోజీరావు గారు, ‘స్రవంతి’ రవికిశోర్ గారు హీరోగా పరిచయం చేశారు. ఆ తర్వాత స్రవంతి మూవీస్ సంస్థలో ‘నువ్వే నువ్వే’, ‘ఎలా చెప్పను?’ చేశా. ఈ సంస్థలో మూడు సినిమాలు చేయడం నా అదృష్టం. హీరోగా నా తొలి సినిమా ‘నువ్వే కావాలి’కి త్రివిక్రమ్ మాటలు రాశారు. దర్శకుడిగా ఆయన తొలి సినిమాలో నేను హీరో కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎంత మంది హీరోలతో చేసినా… ఆయన ఫస్ట్ హీరో నేనే. ప్రకాశ్ రాజ్ గారితో కలిసి ఈ సినిమాలో తొలి సారి చేశా. ఆయన, శ్రియ, ఇతర నటీనటులు అందరితో పని చేయడం సంతోషంగా ఉంది. ‘నువ్వే నువ్వే’ లాంటి సినిమా ఇంకొకటి చేయమని చాలా మంది అడుగుతారు. నాకు ఇటువంటి సినిమా చేసే అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. అమ్మ, ఆవకాయ్, అంజలి, నువ్వే నువ్వే…. ఎప్పటికీ బోర్ కొట్టవు” అని అన్నారు.

ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ ”నువ్వు లేకపోతే ‘నువ్వే నువ్వే’ లేదని రవికిశోర్ గారు అన్నారు. మేమంతా లేకపోతే ‘నువ్వే నువ్వే’ లేదు. టీమ్ అంతా ఎంతో కష్టపడ్డారు. నేను ఈ రోజు ఫుల్ సినిమా చేశా. ‘నువ్వు నాకు నచ్చావ్’ కోసం నన్ను బ్యాన్ చేస్తే… నాపై బ్యాన్ తీసే వరకూ వెయిట్ చేశారు. సినిమా అంటే ఎంతో ప్రేమించే రవికిశోర్, త్రివిక్రమ్ తో జర్నీ ఎంజాయ్ చేశా. త్రివిక్రమ్ దర్శకుడు కాక ముందే రచయితగా నాకు తెలుసు. నా కోసమే మాటలు రాసేవాడిని అనిపించేది” అని అన్నారు.

శ్రియ మాట్లాడుతూ ”త్రివిక్రమ్ గారు, రవికిశోర్ గారు ఢిల్లీ వచ్చారు. ఈ కథ వినగానే నచ్చేసింది. ‘మీరు నిజంగా ఈ కథలో నేను నటించాలని అనుకుంటున్నారా?’ అని అడిగా. షూటింగ్ చాలా ఎంజాయ్ చేశా. తరుణ్ స్వీట్ కో స్టార్. ప్రకాశ్ రాజ్ నా తండ్రిలా ఉండరు. కానీ, సినిమాలో తండ్రిలా చేశారు. మా మధ్య మ్యూజిక్ గురించి డిస్కషన్స్ జరిగాయి. ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ మెమరీ” అని అన్నారు.

నృత్య దర్శకులు సుచిత్రా చంద్రబోస్ & శంకర్, సినిమాటోగ్రాఫర్ హరి అనుమోలు, నటీమణులు శిల్పా చక్రవర్తి, మధుమిత, అనితా చౌదరి, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు