సిరిసిల్లలో యుద్ధ మేఘాలు
– విజయమ్మ పర్యటనతో ఉద్రిక్త పరిస్థితులు
– జనం వద్దన్నా బలవంతపు చొరబాటుకు వైఎస్సార్సీపీ యత్నం
– తెలంగాణకు లేఖ ఇవ్వం.. సభ పెట్టుకుంటాం అన్నట్లు దుస్సాహసం
– తెలంగాణలో పాగా వేసేందుకే ‘దీక్ష నాటకం’ అంటున్న రాజకీయ వర్గాలు
– మీ మద్దతు మాకొద్దు.. మా ఊరిలో అడుగు పెట్టొద్దంటున్న నేతన్నలు
– వస్తే మహబూబాబాద్ పరిస్థితే పునరావృతమవుతుందని హెచ్చరికలు
– విజయమ్మ పర్యటనను అడ్డుకుంటామంటున్న తెలంగాణవాదులు
– 23న సిరిసిల్ల బంద్‌కు టీఆర్‌ఎస్ పిలుపు
”బలవంతుల దుర్భర జాతిని.. బానిసలను కావించరు.. నరహంతకులు ధరాధిపతులై.. చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి..” అన్న శ్రీశ్రీ మాటలను తెలంగాణలో సీమాంధ్ర పాలకులు, సమైక్యవాదులు ఎనాటి నుంచో నిజం చేస్తూనే ఉన్నారు. ఆ శ్రీశ్రీయే ”చిరకాలం జరిగిన మోసం.. బలవంతుల దౌర్జన్యాలూ.. ధనవంతుల పన్నాగాలూ.. ఇంకానా.. ఇకపై చెల్లవు” అంటూ తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తూనే ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అనేకసార్లు దెబ్బతీస్తే.. ఇప్పుడు ఆ బాధ్యతను ఆయన భార్య భుజాలకెత్తుకున్నారు. సిరిసిల్లతోపాటు తెలంగాణ ప్రజలు మా ప్రాంతంలోకి రావద్దని గర్జిస్తున్నా.. లెక్క చేయక నేతన్నల ఇలాఖాలో అడుగుపెట్టే దుస్సాహసానికి విజయమ్మ ఒడిగడుతున్నారు. సిరిసిల్ల ప్రజలు, నేతన్నలు, తెలంగాణవాదులు మాత్రం విజయమ్మను అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండల కేంద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 23న విజయమ్మ సిరిసిల్లలో పర్యటిస్తుందని తెలిసి భారీగా పోలీసు బలగాలను మోహరించారు. దీంతో పట్టణమంతా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నది. నేతన్నలకు మద్దతుగా దీక్ష చేయడానికి తాను పర్యటనకు వస్తున్నానని విజయమ్మ వివరణ ఇచ్చినా తెలంగాణవాదులు మాత్రం ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న పర్యటన అని విమర్శిస్తున్నారు. వైఎస్సార్సీపీని తెలంగాణలో బలోపేతం చేయడమే ఈ పర్యటన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యమని ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయమ్మ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు మాత్రం నేత కార్మికుల సమస్యలపై పోరాడేందుకే తమ నాయకురాలు పర్యటనకు వస్తున్నారని వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే, విజయమ్మ పర్యటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ నేత కార్మికుల కోసమైతే తాను వస్తున్నానని విజయమ్మ ప్రకటించారో ఆ నేత కార్మికులే ఆమె పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. నాడు తమ సహచరులు వందల సంఖ్యలో చనిపోయినా విజయమ్మ భర్త, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కనీసం పలుకరించేందుకు కూడా రాలేదని గుర్తు చేస్తున్నారు. ఆమె భర్త విధానాల వల్లే అప్పుడు 215 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. చనిపోయిన కార్మికులకు ఆమె భర్త ఏమీ చేయలేదని, ఏదో చేశాడని బుకాయించేందుకు తమ వద్దకు వస్తే తరిమి కొడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సీమాంధ్ర పాలకుల వల్ల చాలా నష్టపోయాం, ఇకపై మోసపోయే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. రాజన్న రాజ్యం తెస్తామంటున్న విజయమ్మ సిరిసిల్ల నేత కార్మికులు కోరుకుంటున్నది కేవలం తెలంగాణ రాష్ట్రమేనని తెలుసుకోవాలన్నారు. రాజన్న రాజ్యం వచ్చాకే తమ బతుకులు తెల్లారి పోయాయని ఆరోపిస్తున్నారు. అయినా, మొండిగా విజయమ్మ సిరిసిల్ల పర్యటనకు వస్తే ఆ తరువాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మహబూబాబాద్‌లో విజయమ్మ కొడుకును ఎదుర్కొన్న దాని కంటే దీటుగా విజయమ్మను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే, టీఆర్‌ఎస్ ప్రముఖ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో విజయమ్మను అడ్డుకునేందుకు ఆ పార్టీ భారీగా సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే టీఆర్‌ఎస్ 23న విజయమ్మ పర్యటించే రోజునే సిరిసిల్ల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు అన్ని వర్గాలు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని పార్టీ సీనియర్ నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు తెలిపారు. ఏదేమైనా విజయమ్మ సిరిసిల్ల పర్యటనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆమె దుస్సాహసం మాని, సిరిసిల్ల పర్యటనను మానుకోవాలని రాజకీయ మేధావులు సూచిస్తున్నారు. లేకుంటే పర్యటన వల్ల ఏదైనా నష్టం జరిగితే దానికి విజయమ్మే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. సిరిసిల్ల నేత కార్మికులు మాత్రం విజయమ్మ మా ఊరికి రాకుంటేనే మంచిది, వస్తే మాత్రం మేమేంటో చూపిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.