సీఎం కెసిఆర్ పాలనలో ప్రభుత్వ బడులకు మహర్దశ

 – ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి      – మన ఊరు – మనబడి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
– టీచర్ గా మారిన ఎమ్మెల్యే                                        – కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
– మన ఊరు – మన బడి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ జులై 22 (జనం సాక్షి): సీఎం కెసిఆర్ పాలనలో  ప్రభుత్వ బడులకు మహర్దశ  వచ్చిందని హుజూర్ నగర్   శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 2, 5, 24 వార్డు గల ప్రభుత్వ పాఠశాలలో 95 లక్షల  రూపాయల పై చిలుకు అభివృద్ధి పనులకు మన ఊరు – మనబడి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడం జరుగుతుంది అని ఆయన తెలిపారు. మన ఊరు-మన బడి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. అనంతరం శాసన సభ్యులు సైదిరెడ్డి విద్యార్థులతో  ముఛ్చాటించారు. విద్యార్థులను పలు విషయాలు అడిగి వారి ఆసక్తిని తెలుసుకున్నారు. అలాగే వారికి చదువు-సమాజం-జీవితం మీద అద్భుత అవగాహనని  కల్పించారు.  విద్యార్థులతో మాట్లాడుతూ కేవలం మార్కులు ఒక్కటే జ్ఞానానికి కొలమానం కాదు అన్నారు, చదవడం అంటే పుస్తకాలను మాత్రమే చదవడం కాదు అన్నారు. చదువు జీవితాన్ని గెలవడానికి ఒక సాధనంగా ఉపయోగ పడుతుంది అని తెలియజేసారు. చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ ని కూడా నేర్చుకోవాలి అని తెలియజేసారు. విద్యార్థులు తప్పకుండా స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనకు నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉండాలని తెలియజేశారు. అదే విధంగా కన్న తల్లిదండ్రుల యొక్క కలలను ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు కొనసాగించాలని తెలియజేశారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే  సూచించారు. అదేవిధంగా భారత రాష్ట్రపతి మిస్సైల్ మాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను ఆదర్శాలను విద్యార్థులు సాధించే దిశగా ఎదగాలని వారు తెలియజేశారు. విద్యార్థులు ప్రపంచ జ్ఞానాన్ని సమపాదించుకొని స్థానికంగా జీవితంలో విజయాన్ని సాధించాలని తెలియజేశారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థిని ప్రోత్సహిస్తుందని భుజం తట్టి వారిలో ధైర్యాన్ని పెంపొందిస్తూ కావలసిన వారికి ఆర్థిక సహాయాన్ని కూడా ఇస్తుందని తెలియజేశారు.   రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంపొందించే ఉక్కు సంకల్పంతో  ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థులు అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు, డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టే విధంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమాన్ని రూపొందించారని, ప్రజా ప్రతినిధులు అధికారులు చిత్తశుద్ధితో ప్రణాళికలు సిద్ధం చేసి షెడ్యూల్ ప్రకారం త్వరితగతిన పనులను  పూర్తి చేయాలని పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న తరగతి గదులు, మూత్రశాలలు, ప్రహరీ గోడలు , వంట గదుల నాణ్యతను పరిశీలించి అవసరమున్న చోట వాటి స్థానంలో కొత్తవి నిర్మించుటకు ప్రతిపాదనలు పంపాలని ఇంజినీరింగ్ అధికారులను ఇప్పటికే ఎమ్మెల్యే ఆదేశించారు. అన్ని పనులు పూర్తిచేసి వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలలన్నీ అందుబాటులో ఉంచాలని తెలిపారు. పాఠశాలల పరిరక్షణలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం కావాలని కోరారు. చిన్నారులను ఆకర్షించే విధంగా పాఠశాలల సుందరీకరణ పనులను  చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో  భాగంగా రూ.7,289 కోట్లతో సుమారు 26 వేల ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయనున్నదని అన్నారు.  అయితే ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజల సమిష్టి  భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్‌ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని  దాతలను, స్వచ్చంద సంస్థలను, ఎన్ఆర్ఐలను  కోరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా రంగంలో అనేక సానుకూల మార్పులు వచ్చాయని  అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు త్వరలోనే సంపూర్ణంగా రూపాంతరం చెందుతాయన్న విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రతి విద్యార్థికీ కార్పొరేట్‌కు దీటుగా సకల వసతులతో ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ వేగవంతమవుతున్నది. పాఠశాలల వారీగా పనులను గుర్తిస్తూనే కావాల్సిన నిధుల అంచనాలు రూపొందిస్తున్నది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు ప్రక్రియ వేగవంతమవుతున్నది, మూడేండ్లలో  మూడు దశల్లో రాష్ట్రంలోని అన్ని సర్కారు పాఠశాలలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు. మన ఊరు మన బడిలో భాగంగా రాష్ట్ర  ప్రభుత్వం అన్ని సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించనుంది. బాల, బాలికలకు నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లను వేర్వేరుగా నిర్మించనుంది. అవసరమైన చోట కొత్త లైన్లు వేయడంతో పాటు కొత్త స్విచ్‌ బోర్డులు బిగించనుంది అని తెలిపారు. స్కూలు ప్రాంగణం, ఆట స్థలానికి ప్రహరీలు నిర్మిస్తారు, మధ్యాహ్న భోజనం వండేందుకు వీలుగా కిచెన్‌ షెడ్లు కడుతారు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్‌ రూంలు,  అదనపు తరగతి గదులు నిర్మిస్తారన్నారు. హైస్కూళ్లలో మధ్యాహ్న భోజనం వడ్డించేందుకు వీలుగా డైనింగ్‌ హాల్స్‌ కడుతారు,
మన ఊరు మన బడి పథకం అమలుపై ప్రభుత్వ పకడ్బందీగా ముందుకుపోతున్నది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, పేరెంట్స్‌ కమిటీలు, పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు, మన బడిలో గ్రామస్తులు, పేరెంట్స్‌, పూర్వ విద్యార్థులను భాగస్వాములు చేస్తుందని  తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, మున్సిపాలిటీ  చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి, కార్యదర్శి అమర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.