సీఎం కేసీఆర్‌కు పలువురు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

2
హైదరాబాద్‌,ఫిబ్రవరి 17(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం 63వ వసంతంలో అడుగుపెట్టారు. కేసీఆర్‌గా ప్రజల్లో పాపులర్‌ అయిన ఆయన 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. తెలంగాణ ఉద్యమ రథసారథిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న కేసీఆర్‌కు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.గవర్నర్‌ నరసింహన్‌ బుధవారం సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. అలాగే మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, జుపల్లి కృష్ణారావు, సీఎస్‌ రాజీవ్‌ శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మ, ఎమ్మెల్యేలు రవీందర్‌ రెడ్డి, బాలారాజు, ఎమ్మెల్సీ శంబీపూర్‌ రాజు తదితరులు కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పుట్టినరోజు నాడే రాజ్‌భవన్‌లో సిబ్బంది కోసం రూ. 100 కోట్లతో నిర్మించనున్న క్వార్టర్స్‌కు కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, పలువురు తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయానికి తరలివచ్చిన పలువురు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు సిఎంను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలావుంటే రాష్ట్రవ్యాప్తంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి. హైదరబాద్‌తోపాటు రాష్ట్రంలోని ప్రతీ ఊరు, వీధి, వాడల్లో కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.  కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లి టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో కేసీఆర్‌ జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కార్యకర్తలతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో వంద సంవత్సరాలు జీవించాలని ఆకాంక్షించారు. మెదక్‌ జిల్లా పటాన్‌చెరులో ఘనంగా కేసీఆర్‌ పుట్టిన రోజు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు సీఎం కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో జీవించి రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించాలని కాంక్షిస్తూ స్థానిక దుర్గామాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లగొండలో మంత్రి జగదీవ్వర్‌ రెడ్‌ఇ కేక్‌ కట్‌ చేశారు.