సీఎం కేసీఆర్‌ను ప్రశంసించిన ప్రధాని

1

దిల్లీ,ఫిబ్రవరి8(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. నేడు ఢిల్లీలో నీతీ ఆయోగ్‌ తొలి భేటీ జరిగిన విషయం విధితమే. భేటీ ద్వారా పీఎం దేశాభివృద్ధికి రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచనలు, అభిప్రాయాలను ఆహ్వానించారు. ఈ సమావేశానికి హాజరైన సీఎం కేసీఆర్‌ కేంద్ర, రాష్ట్ర సంబంధాల బలోపేతానికి పలు కీలక సలహాలిచ్చారు. కేంద్ర పథకాల అమలుకు కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్ర నిధులను వాడుకోవడంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వాలని కోరారు. సీఎం అందించిన సలహాలు, సూచనలను మోదీ స్వాగతించారు. కేసీఆర్‌ సూచన మేరకు పథకాల అమలుకు మూడు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. అనంతరం సీఎం ప్రధానితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేజీ టు పీజీ ఉచిత విద్య, వాటర్‌గ్రిడ్‌, హౌసింగ్‌ స్కీం, మిషన్‌ కాకతీయ వంటి పలు పథకాలను ప్రధానికి వివరించారు. దీంతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాల బలోపేతానికి సీఎం ఇచ్చిన సూచనలపై ప్రధాని మోదీ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.