సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి
మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.శనివారం స్థానిక 28వ వార్డులో ఆమె పర్యటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో నీటి కుంటల్లో నీటి నిల్వ వల్ల దోమలు వృద్ధి చెంది డెంగ్యూ , మలేరియా, బోదకాలు వ్యాధుల ప్రబలే ప్రమాదం ఉందన్నారు.ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలని కోరారు.తడి పొడి చెత్తలను వేరు చేసి పారిశుద్ధ్య వాహనాలకు అందించాలన్నారు.రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో వార్డుల్లో దోమలు వృద్ధి చెందకుండా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా,48వార్డులకు స్ప్రేయింగ్ మిషన్లు పంపిణీ చేయడంతో పాటు 5 ఫాగింగ్ మిషన్ల ద్వారా దోమల మందు పిచికారి చేస్తున్నట్లు వివరించారు.నీరు నిలిచిన కుంటల్లో ఆయిల్ బాల్స్ ను వదులుతున్నట్లు పేర్కొన్నారు.వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆశ కార్యకర్తలు, ఆర్పీలు ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.వీధుల్లో నిలిచిన నీటిని, చెత్త తొలగింపు పనులను వెంటనే చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆ వార్డ్ కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, ఎఫ్ఆర్ఓ వసుంధర, జవాన్లు , ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area