సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం

– మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):వర్షాకాలం నేపథ్యంలో ప్రబలనున్న  సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో  ఆశాలు, మెప్మా ఆర్పీలకు వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ,సీజనల్ వ్యాధులపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.ప్రతి నిత్యం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సూర్యాపేట మున్సిపాలిటీ  పాలక వర్గం, అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారని అన్నారు.వర్షాకాలంలో నీటి గుంటల్లో నీరు నిలిచి దోమలు వృద్ధి చెంది  డెంగ్యూ, మలేరియా,బోదకాలు వ్యాధులను వ్యాపింపజేస్తాయని అన్నారు.ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు తమ ఇంటి పరిసరాల్లోని గాబులు,నీటి తొట్లు,  కొబ్బరిబొండాలు,పాతటైర్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు.తడి, పొడి చెత్తలను వేరు చేసి మున్సిపల్ పారిశుద్ధ్య వాహనాలకు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో  వార్డుల్లో దోమలు వృద్ధి చెందకుండా 48 స్ప్రేయింగ్ మిషన్లు పంపిణీ చేయడంతో పాటు 5 ఫాగింగ్ మిషన్ల ద్వారా దోమల మందు పిచికారి చేస్తున్నట్లు వివరించారు.నీరు నిలిచిన కుంటల్లో ఆయిల్ బాల్స్ వేస్తున్నట్లు పేర్కొన్నారు.సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  ఆశ కార్యకర్తలు, ఆర్పీలు ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా వస్తున్న మంచి నీటిని  వేడి చేసి చల్లార్చి తాగితే ఎన్నో లవణాలు మన శరీరానికి అందే అవకాశం ఉందన్నారు.ప్రతి ఒక్కరు మొక్కలను విరివిగా నాటాలన్నారు.మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో రూ.10 వేలు విలువ చేసే ఇంటి పంట కిట్ ను రూ.1500 లకే అందిస్తున్నామని చెప్పారు.ప్రజలంతా సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండి  మున్సిపాలిటీ, వైద్యసిబ్బంది సూచించిన సలహాలను, జాగ్రత్తలు పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.ఈ అవగాహన సదస్సులో  డాక్టర్లు నాజియా , రమ్య, శ్రీరామ్, నర్సయ్య,  కృష్ణమూర్తి, శానిటరీ ఇన్స్పెక్టర్లు సారగండ్ల శ్రీనివాస్, జనార్ధన్ రెడ్డి , డిఈ సత్యారావు, మెప్మా జిల్లా అధికారి రమేష్ ,ఎస్ఎస్ఆర్ ప్రసాద్, మున్సిపల్ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Attachments area

తాజావార్తలు