సీమాంధ్ర కుట్రను అడ్డుకుందాం తెలంగాణ సొసైటీ భూమిని కాపాడుకుందాం

 

సీమాంధ్ర కుట్రను అడ్డుకుందాం తెలంగాణ సొసైటీ భూమిని కాపాడుకుందాం
కోదండరాం
హైదరాబాద్‌, జూన్‌ 20 (జనం సాక్షి) :
తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపర్చేందుకు సీమాంధ్రులు పన్నుతున్న కుట్రలను భగ్నం చేయాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ ఎన్జీవో హౌసింగ్‌ సొసైటీ పరిరక్షణ కోసం టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో చేపట్టిన భారీ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ టీఎన్జీవోల హౌసింగ్‌ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ తెలంగాణ వ్యతిరే కులు, సంఘ విద్రోహ శక్తులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపర్చాలనే కుట్రలో భాగంగానే సొసైటీ దుష్ప్ర చారం సాగిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తున్న టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వామిగౌడ్‌ను ఉద్యమానికి దూరం చేయాలనే ఆయనపై అనవసరపు, అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. స్వామిగౌడ్‌ను వేధించడమంటే ఉద్యమాన్ని టార్గెట్‌ చేయడమేనని ఆయన పేర్కొన్నారు. స్వామిగౌడ్‌పై వేధింపు చర్యలకు ప్రభుత్వం స్వస్తిపలకాలని ఆయన డిమాండ్‌ చేశారు. కక్షపూరిత చర్యలకు పూనుకుంటే చూస్తూ ఊర్కోబోమని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాన్ని, టీఎన్జీవోల సొసైటీ భూములను కాపాడుకుంటామన్నారు. స్వామిగౌడ్‌తోపాటు టీఎన్జీవోల సంఘం సభ్యులకు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ టీజేఏసీ అండగా ఉంటుందని కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు కేటాయించిన భూములను లాక్కొనేందుకు కుట్రపన్నుతున్నారని ఆయన ఆరోపించారు.