సీసీఎస్ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి

దక్కన్ గ్రామీణ బ్యాంకు రీజనల్ అధికారి లక్ష్మణ్
బోధన్, ఆగస్టు 16 ( జనంసాక్షి ) : మహిళ సంఘాల అభివృద్ధి కోసం బ్యాంకులు సీసీఎస్ రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని దక్కన్ గ్రామీణ బ్యాంకు రీజనల్ అధికారి లక్ష్మణ్ స్పష్టం చేశారు. బుధవారం బోధన్ ఐకేపీ కార్యాలయంలో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళ సంఘాల అభివృద్ధి కోసం బ్యాంకులు ఎల్లప్పుడూ తమ సహకారం అందిస్తాయని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలోని మహిళ సంఘాల బలోపేతం కోసం దక్కన్ గ్రామీణ బ్యాంకు కోట్లాది రూపాయల రుణాలను అందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. సంఘాలు తీసుకున్న రుణాలను సజాలంలో చెల్లించినపుడే ఆయా సంఘాల అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన అన్నారు. రుణాల విషయంలో బ్యాంకర్ల నుండి ఎలాంటి సమస్య రాదని, సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. అనంతరం బ్యాంకు లింకేజీ డీపీఎం నీలిమ మాట్లాడుతూ, జిల్లాలో ఈ ఏడాదికి 418 కోట్ల రుణాలను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అందులో ప్రతి మండలంకు 25 కోట్ల చొప్పున రుణాలను అందించేందుకు టార్గెట్ విధించడం జరిగిందన్నారు. అయితే గతంలో సంఘాలు తీసుకున్న రుణాలు చెల్లించేందుకు కాల పరిమితి ఉండేదని తద్వారా సంఘాలకు ఆశించిన స్థాయిలో రుణాలు అందలేదని ఆమె అన్నారు. ప్రస్తుతం అలా కాకుండా సీసీఎల్ ద్వారా రుణాలను అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్కన్ గ్రామీణ బ్యాంకు అధికారులు ఇందుకు ముందున్నారని నీలిమ అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు లింకేజీ ఏపీఎం ప్రసాద్, బోధన్ టీ సెర్ఫ్ ఏపీఎం వెంకటేష్, గంగారాం, డీజీబీ పెంటకాలన్ బ్యాంక్ మేనేజర్ జాన్ ప్రసాద్, బోధన్, కల్దుర్కి, సంగం, సాలంపాడ్ మేనేజర్లు, సీసీలు, బీవోఎలు పాల్గొన్నారు.