సుప్రీంలో మోడీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది

..న్యూఢిల్లీ, జనవరి 2 (జనంసాక్షి):

గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి బుధవారంనాడు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గుజరాత్‌ లోకాయుక్తగా జస్టిస్‌ ఆర్‌ఎ మెహతా నియామకాన్ని సమర్థించింది. జస్టిస్‌ మెహతాను రాష్ట్ర లోకాయుక్తగా ఆగస్టు 2011లో గవర్నర్‌ కమల బెనివాల్‌ నియమించారు. అప్పటికే దాదాపు ఎనిమిదేళ్ళుగా ఆ పోస్టు ఖాళీగా ఉండటంతో గవర్నర్‌ ఆ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ నరేంద్రమోడీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. తనను కానీ, తన మంత్రి వర్గాన్ని కానీ గవర్నర్‌ ఈ విషయంలో సంప్రదించలేదని పేర్కొంది. గుజరాత్‌ ప్రభుత్వ పిటిషన్‌ను  జస్టిస్‌ బిఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎఫ్‌ఎం ఇబ్రహీ కలీఫుల్లాతో

కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించి పిటిషన్‌ను తిరస్కరించింది. లోకాయుక్తగా జస్టిస్‌ మెహతా నియామకం సరైనదేనని గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తరువాతే గవర్నర్‌ ఆయనను నియమించారని పేర్కొంది. రాష్ట్ర లోకాయుక్తగా మెహతా తన విధులను కొనసాగించవచ్చునని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. సుప్రీం తీర్పుతో ఊరట లభించిందా అని జస్టిస్‌ మెహతాని ప్రశ్నించగా ఊరట అనే ప్రశ్నే లేదు. మొత్తం ఈ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనేమీ వ్యాఖ్యానించనని మెహతా చెప్పారు. మెహతా నియామకంలో ఉన్న చట్టబద్దతను గుజరాత్‌ డివిజన్‌ బెంచ్‌ భిన్నాభిప్రాయం వ్యక్తం చేయగా గత జనవరిలో హైకోర్టు ఆయన నియామకాన్ని సమర్థించింది.