సుప్రీం ఆదేశాలు ధిక్కరణ

బంగ్లాలు ఖాళీ చేసేది లేదంటున్న యూపి మాజీ సిఎంలు

తాజాగా ఖాళీ చేయనని మొండికేసిన మాయావతి

లక్నో,మే25(జ‌నంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన మాజీ ముఖ్యమంత్రులు బంగలాలను పట్టుకుని వేలాడుతనే ఉన్నారు. గబ్బిలాల్లాఆగా వారు వదలడానికి ఇష్టపడడం లేదు. సుప్రీం ఆదేశించినా వాటిని ఖాతరు చేయడం లేదు. మరో రెండేళ్ల వరు కుదరదని ములాయం సిం/-గ్‌ యాదవ్‌ చెప్పగా, అసలు ఖాళీ చేసే ఆలోచనేదీ లేదని మాయావతి అన్నారు. కళ్యాణ్‌ సింగ్‌ ఒక్కరే బంగళా ఖాళీ చేశారు. తాజాగా మాయావతి చేసిన ప్రకటన సర్కార్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో యోగీ తదుపరి ఏం చర్యలు తీసుకుంటారో అన్నది చూడాలి. ప్రభుత్వ భవనాల్లో ఉండటం నిర్హేతుకమని వారు వెంటనే ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినా యూపీ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం తన బంగ్లాను ఖాళీ చేయనని అంటున్నారు. ఈ మేరకు మాయావతి సహచరుడు సతీశ్‌ చంద్ర యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ప్రస్తుతం మాయావతి ఉంటున్న బంగ్లాను రాజస్థాన్‌ శాండ్‌స్టోన్‌, పింక్‌ మార్బుల్‌తో డిజైన్‌ చేశారు. ఇందులో మొత్తం పది పడక గదులు ఉన్నాయి. అయితే ఈ బంగ్లాను తన గురువు, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీ రాంజీ కట్టించారని ఆయన జ్ఞాపకార్థంగా దానిని ఖాళీ చేయదలచుకోలేదని అంటున్నారు. ఈ మేరకు ఐదు పేజీల లేఖ రాసి, దానితో పాటు బంగ్లాకు సంబంధించిన ప్రభుత్వ పత్రాలను సతీశ్‌తో ఆదిత్యనాథ్‌కు పంపారు. ఆ లేఖలో 2011లో తాను యూపీ ముఖ్యమంత్రిని అయినప్పుడు తనకు ఆ బంగ్లాను కేటాయించారని అదే ఏడాదిలో జనవరి 13న ఆ బంగ్లాను కాన్షీ రామ్‌ స్మారక భవనంగా ప్రకటించారని పేర్కొన్నారు. మాయావతి ఈ బంగ్లాలో కేవలం రెండు గదుల్లోనే ఉంటున్నారని ఆమె బతికున్నంతవరకూ ఈ భవనంలో ఉండే హక్కుందని అప్పట్లో ప్రభుత్వం అనుమతించినట్లు పత్రాల్లో రాసుంది. ఆదిత్యనాథ్‌తో సమావేశం పూర్తయ్యాక సతీశ్‌ విూడియాతో సమావేశమయ్యారు.

‘2011లో ఈ బంగ్లాను మాయావతికి కేటాయించారు. కానీ, మాయావతి కేవలం రెండు గదుల్లోనే ఉంటుండటంతో యూపీ ప్రభుత్వం ఈ బంగ్లాను కాన్షీ రామ్‌ మెమోరియల్‌గా పరిగణించింది. మిగతా 8 గదుల్లో కాన్షీ రామ్‌కు సంబంధించిన పుస్తకాలతో గ్రంథాలయాన్ని రూపొందించింది.’ అని పేర్కొన్నారు. అయితే సుప్రీం కోర్టు తీర్పు మేరకు మాయావతి త్వరలో తన సొంత బంగ్లాలోకి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. ఒకవేళ కాన్షీ రామ్‌ బంగ్లాను ఖాళీ చేయాల్సి వస్తే అందులో మరొకరు నివసించకూడదని మాయావతి డిమాండ్‌ చేస్తున్నారు. మరి దీనికి యోగి ఆదిత్యనాథ్‌ ఏమంటారో వేచిచూడాలి.