సెక్యులర్‌ కోసమే జెడిఎస్‌తో పొత్తు: శివకుమార్‌

బెంగళూరు,మే21(జ‌నం సాక్షి): బీజేపీ ఎత్తుగడలు తిప్పికొట్టి ఎమ్మెల్యేలందర్నీ ఏకతాటిపై నిలపడంలో తనకు అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించినట్లు  కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ అన్నారు.  రాష్ట్రంలో సెక్యులర్‌ ప్రభుత్వం ఏర్పాటు కోసమే కాంగ్రెస్‌, జనతాదళ్‌ (సెక్యులర్‌) తమ విభేదాలను పక్కనపెట్టినట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారంనాడిక్కడ విూడియాతో ఆయన మాట్లాడుతూ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌, జేడీఎస్‌ పరస్పరం నిప్పులు కురిపించుకున్న విషయాన్ని ఆయనఅంగీకరించారు. అయితే బిజెపిని నిలువరించడానికి ఈ పొత్తులు తప్పవన్నారు. 
రాజకీయాల్లో 1985 నుంచి నేను గౌడలపై పోరాడుతూనే ఉన్నా. గత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో వారిపై పోటీ చేశాను. ఆయన కుమారుడిపై గెలుపొందా. కోడలిపై కూడా గెలిచాను. చాలా రాజకీయాలు జరిగాయి. చాలా కేసులు కూడా రిజిస్టర్‌ అయ్యాయి. అయితే దేశ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కర్ణాటకలో లౌకిక ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది’ అని ఆయన అన్నారు. రాష్ట్రంలో లౌకకి ప్రభుత్వం ఏర్పడాలని రాహుల్‌ గాంధీ నిర్ణయం తీసుకున్నారని, దేశ ప్రజలంతా కోరుకుంటున్నది కూడా అదేనని శివకుమార్‌ అన్నారు. ఆ కారణంగానే తాము పొత్తు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ‘ఇది నా బాధ్యత కావడంతో ఆ చేదునంతా దిగమింగాల్సి వచ్చింది’ అని ఆయన నర్మగర్భంగా తెలిపారు. జేడీఎస్‌తో కూటమి విషయంలో సంతోషంగా ఉన్నారా అని శివకుమార్‌ను అడిగినప్పుడు ‘ఒక్కోసారి వ్యక్తిగత అభిప్రాయాలు లెక్కల్లోకి రావు. సమష్టి నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకరికి అది నచ్చవచ్చు… మరొకరికి నచ్చకపోవచ్చు. ప్రభుత్వం ఏర్పాటుకు అంగీకరించిన వారిలో నేనూ ఉన్నాను’ అని ఆయన సమాధానమిచ్చారు.
కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వం ఐదేళ్లు నిరాఘాటంగా పాలిస్తుందని భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు శివకుమార్‌ ఆచితూచి స్పందించారు. ‘కాలమే సమాధానం చెప్పాలి. ఇప్పటికిప్పుడు నేను ఏవిూ చెప్పలేను. మా ముందు చాలా అంశాలున్నాయి. ఆప్షన్లూ ఉన్నాయి. ఆ తర్వాత మాట్లాడుకుందా’ అని ఆయన సమాధానమిచ్చారు.