సెప్టెంబర్‌ 17 దురాక్రమణే కాదు- కుట్రపూరిత విద్రోహం కూడా

స్వేచ్ఛ, సమానత్వం ఆత్మగౌరవాలే పునాదులుగా చిన్నరాష్ట్రాలు ఏర్పడాలని ఆకాంక్షించిన డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ‘చరిత్రను విస్మరించినవారు చరిత్రను సృష్టించలేరు’ అని ఒక సందర్భంలో వ్యాఖ్యనించారు. అంటే గడిచిన కాలపు చరిత్రలో నుంచి వర్తమాన ప్రజానీకం ఎదుర్కోంటున్న సమస్యల పరిష్కరింపు వెలుగులో భావితరాల భవిష్యతును ఊహించి నిర్మించాలని దాని అర్థం. ఇవాళ 17 సెప్టెంబర్‌ 1948 పరిస్థితి ఒకరికి విద్రోహదినంగా, మరికొందరికి దురాక్రమణ దినంగా, ఇంకొంతమందికైతే ఏకంగా స్వాతంత్య్రదినంగా కనబడుతోంది. చరిత్ర పొడవునా తన ప్రత్యేక జాతీయత, ఆత్మగౌరవ అస్థిత్వాల కోసం తెలంగాణ పురిటినొప్పులు పడుతూ ప్రజాపోరాటాలకు నిలయంగా నిలుస్తున్నప్పటికీ విద్యార్థి, సకల జనుల కేంద్రంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరు జరుగుతున్న ఈ సందర్భంలో ప్రతి చారిత్రాత్మకంగా అంశం, పాలకుల నిర్ణయాలు, మరీ ముఖ్యంగా దోపిడికీ గురవుతున్న ప్రజల జీవితాలకు సంబంధించిన ప్రతీది చర్ఛనీయాంశమే. గత తెలంగాణ ప్రజాపోరాటాల చరిత్ర స్ఫూర్తియే నేడు సార్వజనులను స్వేచ్ఛప్రాంతీయ, ప్రతికూల వర్గపోరాటాలవైపు నడిపిస్తున్నది. అందుకే సెప్టెంబర్‌ 17పై ఓట్లు, సీట్లు వంటి లెక్కల్లో మొగ్గు ఎటువైపు ఉంటే అటు మాట్లాడే పార్టీలు, నాయకులు, కుహనా మేధావులు ఇప్పుడు మన మధ్యన ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా ఏది రాజకీయంగా ప్రయోజనకరమో అదే మాట్లాడుతారు. పైగా చరిత్ర అదేనని బుకాయిస్తుంటారు. కాని చరిత్రను ఎవ్వడు మన్నుకప్పి సమాధిచేయలేదు. చరిత్ర అంటేనే అణిచివేత, అన్యాయ దోపిడీలపై తిరుగుబాటుల పరంపర. మరి ఆసలు సంగతి ఏమిటి? దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర పోరాటం 1947 ఆగస్టు 15న ముగిసింది. అప్పటికే ఒక బలమైన స్వతంత్రరాజ్యంగా నిలదొక్కుంటున్న నైజాం పాలకుడైన మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ నాటి బ్రిటీష్‌ పాలకులు కల్పించిన అవకాశాల్లో ఒకటైన ”స్వతంత్ర రాజ్యంగా”గా ఉండే వెసులబాటును ఉపయోగించుకోదలిచాడు. అందుకే 1947 నవంబర్‌ నెలలో నెహ్రూ-కాంగ్రెస్‌ ప్రభుత్వంతో ”యధాతస్థితి ఒడంబడిక” నిజాం రాజుచేసుకున్నాడు. దాని ప్రకారం విదేశీ వ్యవహారాలు, రక్షణ కమిటీ విషయాలలో తప్ప నైజాం నవాబు స్వతంత్ర పాలన చేసుకోవడానికి నాటి కాంగ్రెస్‌ పాలకులు సుముఖతచూపారు. అయితే నిజాం పాలనలో ఆర్థిక దోపిడికీ, సామాజిక అణచివేతకు నిరంతర గురైనా ఆదివాసీ అడవిబిడ్డలు, వెట్టి మనుషులుగా బతుకులెల్లబోసిన దళిత, బహుజనులు భూమికోసం భుక్తికోసం మానవీయవిలువల కోసం ఊరురా తిరుగుబాటు జెండాలు ఎత్తారు. దీనికి అప్పటి కమ్యూనిస్టులు తర్వాతి కాలంలో నాయకత్వం వహించారు. అప్పటికే రష్యా, చైనా లాంటి దేశాలలో అక్కడి అట్టడుగు శ్రామికవర్గ ప్రజలు నాటి ప్రజావ్యతిరేక రాజరిక వ్యవస్థలను కూల్చిన కమ్యూనిస్ట్‌ పోరాటాలను గమనించిన నెహ్రూ, పటేల్‌లు తెలంగాణలో అట్టడుగు ప్రజలు జరుపునున్న ఎర్రపోరు విజయవంతమైతే తమ అగ్రకుల, అధిపత్యవర్గాల పాలన వ్యవస్థకే పెనుముప్పు అని భావించి ఇదే అదనుగా 1948 సెప్టెంబర్‌ 13న హైదరాబాద్‌ సంస్థాన, విలీనం పేరిట భారత సైన్యం హైదరాబాద్‌ సంస్థానంపై ”అపరేషన్‌ పోలో” అనే పేరుతో సైనిక చర్యకు పూనుకుని కేవలం 5 రోజుల్లో నిజాం సైన్యాన్ని ఓడించి భారతసైన్యంలో చేర్చారు. సెప్టెంబర్‌ 17 నిజంగా విమోచనే అయితే గైర్‌ముల్కీ ఉద్యమం ఎట్టచ్చినట్లు? ఇడ్లీ, సాంబారు గో బ్యాక్‌’ నినాదానికి విలువేంటి? 1969లో ఎగిసిపడిన విద్యార్థిలోక ఉద్యమ నెత్తుటి చారల అస్థిత్వమేమిటి? అదే కాలంలో పేద ప్రజల బానిస బతుకు మార్పుకై రక్తతర్పణం చేయుటకు సైతం వెనుకాడక దూసుకెళ్ళి పోరాట వారసత్వాన్ని ఇచ్చిన నక్సల్బరీ ఉద్యమ పరంపర ఎందుకు ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతోంది? ఆంధ్ర, సామ్రాజ్యవాద వలసవాదుల దోపిడి అంతమై పచ్చని తెలంగాణ కావాలని కలలు కంటున్న నేటితరం పోరాటాలను కొనసాగించినందుకే కదా, ఒక బెల్లి లలిత హత్య, గద్దర్‌పై హత్యాయత్నాలు, శ్రీకాంతాచారి, పృధ్వీనాయక్‌, యాదయ్య, వేణుగోపాల్‌రెడ్డి, కిష్టయ్య, సాయికుమార్‌, సువర్ణ.. ఇలా వందలాదిగా ప్రాణాలుర్పించడం జరుగుతున్నది. చరిత్ర ఇదైతే మత విశ్వాసాలపై మూఢ నమ్మకమున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులు సెప్టెంబర్‌ 17ను విమోచనదినంగా జరపాలని పట్టుబడుతున్నారు. దానికి కారణం నైజాం రాజు ముస్లిం కావడమే. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీలు గోడమీది పిల్లివాటంగా నటిస్తున్నాయి.
సెప్టెంబర్‌ 17, 1948 తెలంగాణలోని అగ్రకులాల్లో అప్పటికే పాలకవర్గాలుగా ఎదిగిన వారికి రాజరిక వ్యవస్థ నుంచి విమోచన కలిగించింది తప్ప. ఈ నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో నియంతృత్వ రాజరిక పాలనలో మట్టిని నమ్ముకున్న వెట్టి దళితులకు గానీ, బహుజన కులాలకు కానీ, స్త్రీలకు గానీ, పేద ముస్లిం, మైనారిటీలకు గానీ ముమ్మాటికి సెప్టెంబర్‌ 17 విద్రోహదినమే అవుతుంది. ఎందుంటే నిజానికి ఆ దినం నుంచే దోపిడి వర్గాల సంఖ్య, బలం మరింత పెరిగింది. అదే ఇప్పటికీ కొనసాగుతున్నది. అందుకే సెప్టెంబర్‌ 17, 1948ను తెలంగాణ మెజార్టీ ప్రజల పాలిట విద్రోహ దినంగానే చూద్దాం. తెలంగాణ పల్లె పల్లెనా అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున నిరసనగా నల్లజెండాలు ఎగరేద్దాం. అది మనందరి బాధ్యత కూడా.