సెప్టెంబర్ 5 గురుపూజోత్సవం రోజున ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా సత్కరించాలి : భాస్కర్ రాథోడ్
రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి):-
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులను కూడా సెప్టెంబర్ 5 న ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి,సత్కరించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం(టీ పి టి ఎఫ్) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భాస్కర్ రాథోడ్ అన్నారు.సమావేశం లో ఆయన మాట్లాడుతూ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విద్యకు ఉన్నతమైన ప్రాధాన్యం ఇవ్వాలని,నాణ్యమైన విద్యను అందించేలా,విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 12 వేల ప్రైవేటు పాఠశాలల్లో,4 లక్షల మంది ఉపాధ్యాయులు,30 లక్షలకు పైగా విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు.తక్కువ జీతాలతో రోజుకు 8 గంటల నుండి 12 గంటలకు పైగా పనిచేస్తూ,రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు.విద్యార్థుల భవిష్యత్తు కోసం,వారి విద్యాభివృద్ధి కోసం,వివిధ బోర్డు పరీక్షలు,పోటీ పరీక్షల్లో రాణించడం కోసం, ఉపాధ్యాయులు ఎంతో కష్టపడుతూ ఫలితాలను రాబడుతున్నారు.వీరు పని చేస్తున్న పాఠశాలలకు ప్రభుత్వం గుర్తింపునిస్తుంది,అందులో చదివే పిల్లలను కూడా ప్రభుత్వం గుర్తించి, వివిధ బోర్డు,పోటీ పరీక్షలకు,స్కాలర్ షిప్ లకు ఎంపిక చేస్తుంది.కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం,రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం,తక్కువ జీతాలతో అధికంగా పనిచేస్తూ,అర్ధాకలితో అలమటిస్తూ,విద్యా-బోధనే ఏకైక వృత్తిగా,ఆహోరాత్రులు పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదు,అనేదే మా ప్రశ్న.కరోనా,లాక్ డౌన్ సమయంలో కూడా,వేలాది మంది ఉపాధ్యాయులు సగం జీతాలకే ఆన్లైన్లో గంటల తరబడి తరగతులు నిర్వహించి,విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల,రాజకీయ నాయకుల,ప్రజా ప్రతినిధుల పిల్లలకు విద్యను బోధించేది ప్రైవేటు ఉపాధ్యాయులే.తరగతుల బోధనే కాకుండా, ఎంతోమంది ఉపాధ్యాయులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ,సమాజానికి సేవ చేస్తున్నారు.తెలంగాణ ఉద్యమ సమయం నుండి నేటి వరకు,రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు.కవితలు రాస్తూ,పాటలు రాస్తూ,పాడుతూ,రచనలు రాస్తూ సమాజంలో తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు.అలాంటి ప్రైవేటు ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వాలు ఎందుకు గుర్తించడం లేదు? ప్రభుత్వాలు సెప్టెంబర్ 5 న, దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని, అంగరంగ వైభవంగా జరుపుతున్నాయి.ఆ రోజున ప్రభుత్వాలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయులుగా,గుర్తించి సత్కరిస్తుంది.ప్రైవేటు ఉపాధ్యాయులను ఎందుకు గుర్తించవు,సత్కరించవు.ఈ ప్రభుత్వాలు..అనేదే ప్రతి ప్రైవేటు ఉపాధ్యాయుడి ప్రశ్న.విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులే…అందులో తేడాలోద్దు.ఉపాధ్యాయ దినోత్సవం కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులదే కాదు,ప్రైవేట్ ఉపాధ్యాయులది కూడా.ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావాల్సిన అన్ని అర్హతలు ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా ఉన్నాయి.కావున సెప్టెంబర్ 5న,నిర్వహించు గురుపూజోత్సవం సందర్భంగా,ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా,ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి,సత్కరించాలని,తెలంగాణ రాష్ట్రంలో ఉన్న,4 లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయుల పక్షాన “తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం” ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని, ప్రతి సంవత్సరం ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వం పక్కనపెట్టి కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే ఎంపికచేయడం బాధాకరం అని రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భాస్కర్ రాథోడ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేట్ టీచర్ల శ్రమను, కష్టాని, సేవాగునని గుర్తించాలని ప్రభుత్వాన్ని, విద్యాశాఖను కోరారు.