సైనిక ప్రాజెక్టుల్లో జాప్యం తగదు : ఆంటోని
బెంగుళూరు: మిలిటరీ ప్రాజెక్టులకు సంబంధించి డెలివరీలలో జాప్యం జరగరాదని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధికారులను రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ఆదేశించారు. మంగళవారం ఏరోస్పేస్ ఉత్పత్తులపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తేలికపాటి యుద్ధ విమానం తేజాస్ ప్రాథమిక అనుమతి పొందిందని అన్నారు. 20 సంవత్సరాలుగా ఈ విమానాన్ని అభివృద్ధి చేస్తూనే ఉన్నారన్నారు. చిట్టచివరి క్లియరెన్స్ లభిస్తేనే భారత్ వైమానికి దళంలో ప్రవేశపెట్టేందుకు వీలుంటుం దన్నారు. ఇక మధ్య తరహా శిక్షణ జెట్ విమానాన్ని రూపొందించడంలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ కూడా చాలా జాప్యం చేస్తోందన్నారు. వచ్చే ఏరో ఇండియాషోకు మాత్రం తేజాస్‌ను సిద్ధం చేయాల్సిందేనన్నారు. ఐఎఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఎన్.ఎ.కె.బ్రౌన్ మాట్లాడుతూ అభివృద్ధి ప్రాజెక్టులలో జాప్యం జరుగుతున్నందున తమ ఆధునికీకరణ ప్రణాళికలు పరిమితమయ్యాయని చెప్పారు.