సైన్యం కాపాడితే తాను రక్షించానని

మోడీ చౌకబారు ప్రచారం
వరద బాధితులను ఆదుకుంటాం : రాహుల్‌
డెహ్రాడూన్‌, జూన్‌ 25 (జనంసాక్షి) :
ఉత్తరాఖండ్‌ వరద బాధితులను సైన్యం కాపాడి సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తే తాను రక్షించానని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చౌకబారు ప్రచారం చేసుకుంటున్నారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. బాధితులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. భారీ వరదలతో దారుణంగా దెబ్బతిన్న గుప్తకాశీ ప్రాంతంలో రాహుల్‌ మంగళవారం పర్యటించారు. అలాగే, కేదార్‌నాథ్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం ఆయన వరద బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న సిబ్బందితోనూ మాట్లాడారు. వరదల్లో గల్లంతైన కుటుంబాలను పరామర్శించారు. వారికి మనోధైర్యం చెప్పి, వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలను ముమ్మరం చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అయితే, సహాయక చర్యలు కొనసాగుతున్న తరుణంలో రాహుల్‌ పర్యటించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. వీఐపీల పర్యటనతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతుందని, అదే ఉద్దేశంతో తాను కూడా ఉత్తరాఖండ్‌కు వెళ్లలేదని హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. వీవీఐపీలు ఎవరూ ఉత్తరాఖండ్‌కు వెళ్లొద్దని ఆయన సూచించినప్పటికీ, రాహుల్‌ పర్యటించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, వీటిని కాంగ్రెస్‌ పార్టీ తిప్పికొట్టింది. రాహుల్‌ హెలీక్యాప్టర్‌లో వెళ్లలేదని, రోడ్డు మార్గంలో పర్యటించారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ తెలిపారు. ‘సహాయ చర్యలు దాదాపు పూర్తి కావొచ్చాయి. కొన్ని చోట్ల మాత్రమే అవి కొనసాగుతున్నాయి. అయినా, ఆయన (రాహుల్‌) హెలీక్యాప్టర్‌ తీసుకొని వెళ్లలేదు. రోడ్డు మార్గంలో వెళ్లారని’ చెప్పారు. 15 వేల మంది గుజరాతీయులను రక్షించానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకోవడం తగదన్నారు. ఆర్మీ, నేవీ, పారామిలిటరీ బలగాలు రేయింబవళ్లు కష్టపడి యాత్రికులను రక్షిస్తే.. మోడీ తాను రక్షించానని చెప్పుకోవడం అబద్దమన్నారు. ‘రాహుల్‌ వీఐపీ వలే అక్కడికి వెళ్లలేదు. బాధితులకు సహాయక చర్యలు సరిగా అందుతున్నాయో లేదో తెలుసుకొనేందుకు సగటు పౌరుడిగా, కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడిగా వెళ్లారని’ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి అన్నారు. నేను ఇది చేస్తానని, అది చేస్తానని ఆయన చెప్పలేదని.. పరోక్షంగా మోడీని ఉద్దేశించి విమర్శించారు.