సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన
 సైబ్ హర్ అవగాహన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు.సైబర్ నేరాలకు, అంతర్జాల మోసాలను నివారించడం, ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా దేశంలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర పోలీసు సైబర్ కాంగ్రెస్ ప్రాజెక్ట్ లో భాగంగా సైబర్ హర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.దీనిలో భాగంగా విద్యాశాఖతో కలిసి విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా నియమించారు.గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్దినులకు, ఉపాధ్యాయులకు సైబర్ నేరాల పట్ల, మహిళలపై వేధింపుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం, సైబర్ మోసాలకు, సైబర్ నేరాలకు గురి కాకుండా చిన్న వయస్సు నుండి శిక్షణ ఇవ్వడం, అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రజలను మోసం చేస్తున్నారని, సైబర్ నేరాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్లను స్వీకరించ వద్దని,  ఫోన్ల ద్వారా మహిళలను వేధిస్తే షీటీమ్ లకు ఫిర్యాదు చేయాలని అన్నారు.ఆన్ లైన్ మోసాల పట్ల  ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వుండాలని అన్నారు.సైబర్ అంబాసిడర్లకు శిక్షణ ఇవ్వడం హర్షణీయమని అన్నారు.‌జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ  కోవిడ్ మూలంగా ప్రతి ఒక్కరూ ఇంటికి పరిమితమై , మొబైల్ వాడకం పెరిగి కొత్త కొత్త యాప్ లు, గేమ్స్ వెబ్ సైట్స్, ఆన్ లైన్ సైట్ ల వలన నష్టం ఎక్కువగా జరిగిందన్నారు.ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ సేఫ్టీ, మొబైల్ సెక్యూరిటీ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.అపరిచిత వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్, మెసేజ్ లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబ్ హర్ ట్రైనింగ్ ద్వారా జిల్లాలో  1650 మంది టీచర్లు, 3300 మంది విద్యార్దినులకు, 80 క్లబ్ లకు రాష్ట్ర మహిళా పోలీసు శాఖ,  సైబర్ సేఫ్టీ శాఖ తెలంగాణ పోలీసు, విద్యాశాఖ  ద్వారా శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో సైబర్ అంబాసిడర్ లను తయారు చేసినట్లు తెలిపారు.ఉత్తమ ప్రతిభ కనపరిచిన సైబర్ అంబాసిడర్ లకు జిల్లా కలెక్టర్, ఎస్పీ లు  బహుమతులు అందజేశారు.మొదటి బహుమతిని తనూజ,ద్వితీయ బహుమతిని లిఖిత,తృతీయ బహుమతిని దేవిశ్రీ గెలుచుకున్నారు. డిఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి, పట్టణ సిఐ రాజశేఖర్ జిల్లా కలెక్టర్, ఎస్పీ ల చేతుల మీదుగా మెమెంటో స్వీకరించారు.షి టీమ్ ఎఎస్ఐ పాండు నాయక్, జాఫర్ ఆలి, సాయి జ్యోతి, శివరాం లకు మెమెంటోలు అందజేశారు.ఈ కార్యక్రమంలో డిఈఓ అశోక్, కోఆర్డినేటర్ రమణ తదితరులు పాల్గొన్నారు.