సొంత లాభం కొంత మాని కరోనా రోగులకు సాయం చేయండి
* పౌష్టికాహారం అందక పెరుగుతున్న కరోనా తీవ్రత
* కొన్నిచోట్ల దాతృత్వం చాటుతున్న స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవకులు
* కష్టకాలంలో కంటికి కనిపించని ప్రజాప్రతినిధులు
* ఎన్నికల సమయంలో మాత్రం విచ్చలవిడిగా ఖర్చుపెట్టే నేతలు
* రాజకీయ విమర్శలలో పోటీపడే పాలక ప్రతిపక్షాలు సాయం చేయడంలో సవాళ్లు విసరండి
* బాధితులకు ఫోన్ లో పలకరింపు కూడా పెద్ద ఊరటే…
హైదరాబాద్, మే 20 (జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. చాలాచోట్ల కరోనా టెస్టింగ్ కిట్లు సరిపోయినన్ని అందుబాటులో లేకపోవడంతో కరోనా అనుమానితులు పరీక్షా కేంద్రాల చుట్టూ రెండు మూడు రోజులు తిరుగుతున్నారు. ఈలోపు కరోనా లక్షణాలు పెరగడంతో స్వచ్ఛందంగానే ప్రభుత్వం సూచించిన కరోనా చికిత్సను ప్రారంభిస్తున్నారు. కరోనా బారినపడటంతో నీరసంగా అవుతున్నారు. కరోనా చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్స్ మందులు వాడటంతో మరింత బలహీనం అవుతున్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్ డౌన్ అమలుచేస్తుండటంతో ప్రైవేట్ ఉద్యోగులు, కూలీలు, చిరువ్యాపారులు, కులవృత్తుల వారు, వివిధ రకాల సేవలందిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నవారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలు సైతం కరోనా బారినపడితే మానసికంగా కృంగిపోవడమే కాకుండా ఆర్థికంగా, శారీరకంగా చితికిపోతున్నారు. ఇలాంటి వారికి సాంత్వన చేకూర్చి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ఇరుగుపొరుగువారు తీసుకోవాలి. కొన్నిచోట్ల స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, సామాజిక సేవకులు సాయం చేసేందుకు ముందుకు వచ్చి కరోనా బాధితులకు వీలైనంత అండగా ఉంటున్నారు. కష్టకాలంలో ఒకరికొకరం అంటూ నిస్వార్థంగా తమ సేవలు అందిస్తున్నారు. కానీ విచిత్రంగా రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు మాత్రం కరోనా భాదితులకు భరోసాగా ఉండాలనే చిత్తశుద్ధితో ఎక్కడా ముందుకురావడం లేదు. రాజకీయంగా లబ్ధి పొందడానికి ఎలాంటి అవకాశం ఉన్నా సవాళ్లు, ప్రతిసవాళ్లతో నిత్యం ప్రజల నోళ్లలో ఉండే ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎక్కడా ప్రజల పక్షాన కనపడటం లేదు. ఎన్నికల సమయంలో తమ స్వార్థం కోసం పోటీ పడుతూ విచ్చలవిడిగా ఖర్చుపెట్టే బడా నేతలు సైతం తమ ప్రజలు అనారోగ్యంతో సతమతం అవుతుంటే స్పందిచకపోవడం విచారకరం. ఇప్పటికైనా కనీసం గెలిచిన ప్రజాప్రతినిధులు స్పందించి కరోనా బాధితులకు సాయం చేయడానికి ముందుకురావాలి. గుడ్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ లాంటి పోషకాహార పదార్థాలు కరోనా బాధితులకు అందించాలి. కనీసం ఊరికి ఒకట్రెండు పల్స్ ఆక్సీ మీటర్లు సమకూర్చాలి. సర్పంచ్ నుంచి ఎంపీ స్థాయి వరకు ఎందరో ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇలాంటి కార్యక్రమంలో తలా కొంత భాగస్వామ్యులైతే ఎవరికీ భారంలా ఉండదు. పేదలకు కొండంత భరోసాగా ఉంటుంది. అందరూ ఆర్థికంగా ఆదుకోలేకపోవచ్చు, అందరికీ ఆర్ధిక సహాయమే కావాలనీ లేదు. మానసికంగా మదనపడుతున్న వారికి ఒక చిన్నమాట కూడా కొండంత స్థైర్యాన్ని ఇస్తుంది. మాట సాయం అందరూ చేయగలిగినవారే, ఓట్ల కోసం ఓటర్ల ఫోన్ నెంబర్ ఎలాగో దొరికిచ్చుకుంటారు. ఆ ఫోన్ నెంబర్లు ఇప్పుడూ కనుక్కోండి, చేతనైన సాయం చేయండి, ఓ రెండు మాటలు మాట్లాడండి. ఎదుటివారికి సవాల్ విసరండి. ఇది కరోనా కాలం, కష్ట కాలం.. ఇప్పుడు ఎవరు సాయం చేసినా కరోనా బాధితులు మరిచిపోరు. ఎందుకంటే వాళ్ళు ఓటర్లు మాత్రమే కాదు, మన అమాయక ప్రజలు కూడా.