సోనియాను అరెస్టు చేసే దమ్ముందా?

5

– కేంద్ర సర్కారుపై కేజ్రీవాల్‌ ఫైర్‌

న్యూఢిల్లీ,మే7(జనంసాక్షి):  ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. అగస్టా కుంభకోణం విచారణ అంగుళం కూడా కదల్లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ విమర్శించారు. ఈ వ్యవహారంలో ఇటలీ ప్రభుత్వమే చాలా స్పీడుగా వ్యవహరించి కేసులు నమోదు చేసి దోషులను జైలకు పంపిందన్నారు. ఈ కుంభకోణంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కేజీవ్రాల్‌ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఆగస్టా కుంభకోణం కేసులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ విరుచుకు పడ్డారు. ఎన్నికలకు ముందు అవినితీపరులను తప్పకుండా శిక్షిస్తామని ప్రధాని మోదీ దేశ ప్రజలకు హావిూ ఇచ్చారని.. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా.. అగస్టా కుంభకోణంలో ఒక్కరిని కూడా జైల్లో పెట్టలేకపోయారని ఆరోపించారు. కుంభకోణం విషయమై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని ఎందుకు విచారించడంలేదని ప్రశ్నించారు. కనీసం కుంభకోణం గురించి అడిగే ధైర్యం కూడా ప్రధాని మోదీ చేయలేకపోతున్నారని విమర్శించారు. ఈ కేసులో వెంటనే చర్యలు చేపట్టి నిందితులకు శిక్ష విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కుంభకోణంలో కాంగ్రెస్‌, బీజేపీలు పొత్తుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సోనియాగాంధీని అరెస్టు చేసే ధైర్మం మోదీకి లేదన్నారు. ఇటాలియన్‌ కోర్టు తీర్పులో సోనియాతోపాటు అహ్మద్‌పటేల్‌ ఇంకా పలువురు కాంగ్రెస్‌ ప్రముఖుల పేర్లను ప్రస్తావించిన విషయాన్ని కేజ్రీవాల్‌ గుర్తు చేశారు. అయినా మోదీ ప్రభుత్వం వారిని అరెస్టు చేసేందుకు ధైర్యం చేయడంలేదని పేర్కొన్నారు. బీజేపీ సోనియాను అరెస్టు చేయదు, మోదీ డిగ్రీ విషయాన్ని కాంగ్రెస్‌ ప్రస్తావించదని దుయ్యబట్టారు. ప్లీజ్‌ సోనియా గాంధీ గారు.. హెలికాప్టర్ల స్కామ్‌ లో ఎంత డబ్బు తీసుకున్నారో చెప్పండి ప్లీజ్‌..! అని అడిగితే ఆవిడ నిజం చెబుతుందా? కచ్చితంగా చెప్పదు. అందుకే సోనియా గాంధీని అరెస్ట్‌ చెయ్యాలి. లాకప్‌ లో ఉంచి రెండంటే రెండు రోజులు విచారిస్తే నిజానిజాలు వాటంతట అవే తన్నుకొస్తాయి. కానీ సోనియాను జైల్లో పెట్టాల్సింది ఎవరు? అంత దమ్ము 56 ఇంచుల ఛాతీ ఉందని చెప్పుకునే నరేంద్ర మోదీకి ఉందా?’ అంటూ ఒకేసారి అటు అధికార , ఇటు విపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో ఆమ్‌ ఆద్మీ విరుచుకుపడ్డారు.  ఆప్‌ నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న కేజీవ్రాల్‌ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై నిప్పులు చెరిగారు. ‘అగస్టా కుంభకోణంపై ఇటలీ కోర్టు ఇచ్చిన నివేదికలో సోనియా గాంధీతోపాటు ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ పేర్లు స్పష్టంగా ఉన్నాయి. ఇవి వెలుగులోకి వచ్చి నాలుగేళ్లు దాటింది. భారత్‌ ను అవినీతి రహిత దేశంగా మార్చుతామని, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని హావిూ ఇచ్చి నరేంద్ర మోదీ రెండేళ్ల కిందట ఎన్నికల్లో గెలిచారు. మరి అగస్టా విషయంలో ఆయన ఇంతకాలం ఎందుకు సైలెంట్‌ గా ఉన్నారు? ఆధారాలున్నా చర్యలు తీసుకోలేదెందుకు? అలాంటప్పడు  సీబీఐ, ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు ఉండి లాభం ఏమిటి? వాటిని వెంటనే మూసేయండి’ అని కేజీవ్రాల్‌ ఉద్వేగభరితంగా మాట్లాడారు. చిన్నచిన్న కేసులకే ఆమ్‌ ఆద్మీకి చెందిన ఎమ్మెల్యేలను జైళ్లలో పెట్టించిన మోదీ.. ఇంత పెద్ద స్కాం విషయంలో మౌనంగా ఉండటం ఆయన చేతగాని తనానికి నిదర్శనమన్నారు.  ఎమ్మెల్యే సోమ్‌ నాథ్‌ భారతి, భార్యతో తగువులాడాడని ఐదురోజులు కటకటాల్లోకి నెట్టారు. ఏం.. భార్యా భర్తలు కీచులాడుకోరా? రేప్‌ ఘటనపై ఆందోళన చేసిన మరో ఎమ్మెల్యేని నాలుగు రోజులు బొక్కలో వేశారు. లంచంపై పోరాడిన ఓ ఆర్మీ ఆఫీసర్‌ ను రెండు రోజులు స్టేషన్‌ లో ఉంచారు. అయ్యా మోదీ గారు.. విూ ప్రతాపం చిన్నవాళ్లపైనేనా? పెద్దవాళ్ల జోలికి వెళ్లరా? లేక కాంగ్రెస్‌ వాళ్లతో పెట్టుకుంటే విూ కూసాలు కూడా కదలిపోతాయని భయమా?’ అంటూ అగస్టా స్కాంలో సోనియాపై చర్యలకు వెనకాడుతున్న ప్రభుత్వం తీరును కేజీవ్రాల్‌ ఎండగట్టారు. హరియాణా, రాజస్థాన్‌ లలో సోనియా అల్లుడు రాబర్ట్‌ వాద్రా పెద్ద ఎత్తున భూములు కొన్నారని ఆరోపణలున్నాయని, ఆ రెండు రాష్టాల్ల్రో ఇప్పుడు బీజేపీనే అధికారంలో ఉందని, అలాంటప్పుడు వాద్రాపై ఎంక్వైరీ ఎందుకు వేయడంలేదని అరవింద్‌ ప్రశ్నించారు. ఎందుకంటే ఆయనకు ధైర్యం లేదని ఘాటుగా విమర్శించారు. కేజ్రీ విమర్శలతో జంతర్‌మంతర్‌ వద్ద చప్పట్లు మార్మోగాయి.