సోమన్న క్షీరగిరి క్షేత్రంలో కార్తీక సందడి

లక్షదీపోత్సవంకోసం ఏర్పాట్లు

జనగామ,నవంబర్‌3(జ‌నంసాక్షి): లక్షదీపోత్సవ కార్యక్రమానికి సోమన్న ఆలయం ముస్తాబు చేశారు. కార్తీక మాసం సందర్భంగా శైవ క్షేత్రమైన పాలకుర్తి సోమన్న ఆలయంలో గిరి ప్రదక్షిణ, అఖండ జ్యోతి, లక్షదీపోత్సవం కన్నుల విందుగా నిర్వహిస్తారు .దక్షణ భారత దేశంలో అఖండజ్యోతి నిర్వహిస్తున్న ఆలయంలో మూడో ఆలయంగా ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రమైన పాలకుర్తి శ్రీ స్వయంభూ శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అఖండజ్యోతి నిర్వహిస్తారు. సోమన్న క్షీరగిరి క్షేత్రంలో ఎతైన కొండ పైన అఖండజ్యోతి దర్శనానికి ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని కన్నుల విందుగా తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆలయ పరిసరాలలో సదుపాయాలు కల్పించే దిశకు సిద్ధం చేశారు. కొండపై నుంచి దిగువకు ఇరువైపుల ఆలయ మెట్లు, ఆలయ ప్రాగణం అంతా లక్షదీపోత్సవాలు వెలిగించేందుకు సన్నాహలు చేశారు. అఖండజ్యోతి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇకపోతే కార్తీక పౌర్ణమి వేడుకలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బుగులు వేంకటేశ్వర స్వామి దేవాలయ ఈవో తెలిపారు. గుట్ట దిగువ భాగం నుంచి దేవాలయం వరకు వెళ్లే ఘాట్‌ రోడ్డుకు ఇరువైపుల గల మట్టి రోడ్డుకు మరమ్మతులు చేయించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్రతాల్లో పాల్గొనే వారు తమ వెంట కలశం, మంగళ హారతులు తీసుకురావాలని తెలిపారు. వ్రతానికి కావాల్సిన మిగితా సామగ్రిని దేవాలయం నుంచి ఉచితంగా అందజేస్తామన్నారు.