సోషల్ మీడియా అభివృద్ధి – అవకాశాలు, సవాళ్లు
(మంగళవారం తరువాయి భాగం)
సోషల్ మీడియాలో కొంతమంది నెట్ వినియోగదారులు ప్రముఖ వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు ప్రైవసీకి భరోసా ఇచ్చే చట్టాలను, కాపీరైట్ చట్టాలను, ఇతర మానవ హక్కుల చట్టాలను కూడా ఉల్లంఘిస్తున్నారు. సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందిన ఫేస్‌బుక్, ఆర్కూట్ వంటివాటిలో ఫ్రెండ్స్ రిక్వెస్ట్‌ల పేరిట నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి మోసాలు చేస్తున్నారు. అలాగే వీడియో చాటింగ్ వల్ల యువత అశ్లీల మార్గంలో ప్రయాణిస్తున్నారు. హ్యాకింగ్ వల్ల ఈ మధ్యకాలంలో ప్రముఖ రచయితలు, డాక్టర్లు, లాయర్ల ప్రొఫైల్స్ నుంచి అందరికీ అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలు షేర్ కావడం గురించి తెలిసి వారిలో చాలామంది తమ ప్రొఫైల్స్‌ను డీ ఆక్టివేట్ చేసుకున్నారు.ఉగ్రవాదుల ఎత్తుగడలకు కూడా సామాజిక మాధ్యమం ఉపయోగ పడుతుందనడంలో అతిశయోక్తి లేదు. ముంబై దాడులకు ముంబైలో దాడి చేయాల్సిన ప్రదేశాలను గూగుల్ ద్వారా అధ్యయనం చేశారు అన్న వార్తతో మనదేశం యావత్తు దిగ్భ్రాంతికి లోనైంది. సెర్చ్ ఇంజిన్ల వినియోగం చాలా ఎక్కువ అయిన నేపథ్యంలో వాటి వినియోగ నియంత్రణ లోపించింది. ప్రజలను మోసం చేసేవాళ్లకు అత్యుత్తమ, అతితక్కువ వ్యయంతో లేదా పైసా ఖర్చు లేకుండా మోసం చేయగల సాధనం సోషల్ మీడియా. రోజుకో కొత్తరకం మోసం వెలుగు చూస్తున్నప్పటికీ, ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య అతిస్వల్పం. తీర్పు వచ్చిన కేసైతే ఒకటే! ఆంధ్రప్రదేశ్‌లో 2004లో నమోదైన సైబర్ నేరానికి సంబంధించిన కేసులో ముద్దాయికి గతేడాది సంవత్సరం జైలు శిక్ష, పన్నెండు వేల జరిమానా విధించారు. ఇప్పటి వరకూ సైబర్ నేరాలకు పడిన శిక్ష ఇదే! అసభ్య ప్రొఫైల్స్ కోకొల్లలు. వీటిని రిపోర్ట్ చేసే సౌకర్యం ఉన్నప్పటికీ చాలామంది వీటిపై ఫిర్యాదు చేయరు. అభ్యంతరకరమై న చిత్రాలు, వీడియోలు అప్‌లోడ్ చేయడం, వాటిని ఒకరి నుంచి ఒకరికి షేర్ చేయడం వల్ల పరిస్థితి దిగజారుతుంది. అసలు ఇలాంటి వెబ్‌సైట్లు, ప్రొఫైల్స్ ఏర్పడకుండా చూసే ఫిల్టరింగ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయాలి.భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2000ను చట్టంగా తీసుకువచ్చిన తర్వాత, ఆ చట్టంలో సెక్షన్ 46లోని సబ్‌సెక్షన్ 5 ప్రకారం, సైబర్ అప్పిలేట్ ట్రిబ్యున ల్‌ను స్థాపించారు. సైబర్ చట్టాన్ని కలిగి ఉన్న దేశాల్లో ప్రపంచంలో మనది పన్నెండో దేశం. మన రాష్ట్రం సైబర్ ట్రిబ్యునల్ అథారిటీని 2011 జూన్‌లో సచివాలయంలోని డి బ్లాకులో ఏర్పాటు చేసింది. హైదరాబాద్-నాంపల్లి మహిళా పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఒక విభాగం, సైబరాబాద్ – సైబరాబాద్ కమిషనరేట్లలో ఒక విభాగం, మసాబ్‌ట్యాంకు – కేంద్ర పరిశోధనా విభాగంలో ప్రత్యేక సైబర్ క్రైం విభాగం. ఇది రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన బాధితుల కోసం ఏర్పాటు చేశారు. ఈ మూడు విభాగాల్లో బాధితులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. మహిళలను అసభ్యంగా చూపడా న్ని నియంత్రించే చట్టం -1986 కు సవరణల్లో భాగంగా ఇప్పుడు ప్రింట్ మీడియాతో పాటు టీవీ చానెల్లు, ఇంటర్నెట్, ఎంఎంఎస్, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తాన్ని చేర్చడం వల్ల మొదటిసారి నేరానికి మూడేళ్ల జైలు, యాభైవేల జరిమా నా, అదే నేరం మరోసారి చేస్తే ఏడేళ్లవరకూ జైలు శిక్ష, లక్ష నుంచి ఐదు లక్షల వరకు జరిమా నా విధించే అవకాశం ఉంది. సైబర్ నేరాలు చాలామందికి తెలియవు. హోం శాఖలో కూడా వీటి గురించి సరైన అవగాహన లేదు. అందుకే ఈ నేరాల గురించి శిక్షణ అవసరం. ప్రతి నేరాన్ని ఆ నేర విధానాన్ని పరిశోధించి, దానికి సంబంధించిన యంత్రాంగా న్ని, అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేశాక, కొత్త నేర విధానాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈ ట్రాన్స్ ఫర్ మొదలైన అంశాల్లో కొన్ని లోపాలున్నాయి.సోషల్ మీడియాను మీరు అభిమానించండి లేదా అసహ్యించుకోండి కానీ దానిని విస్మరించడం మాత్రం మీకు సాధ్యం కాదు. భారతదేశంలో మనం శరవేగంగా పెరిగిపోతున్న సోషల్ మీడియాలో పురోగమన అంశాలను పరిగణలోకి తీసుకొని, తిరోగమన అంశాలను పక్కకు పెట్టి ముందకుసాగాలి.
– రాధిక గట్టు,
హన్మకొండ.