సోషల్ విూడియా ప్రచారాలతో గందరగోళం
కొత్తగూడెం,సెప్టెంబర్10(జనంసాక్షి): కాంగ్రెస్, టీడీపీ, సీపీఐల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉన్నందున జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఏయే పార్టీలకు ఏయే సీట్లను కేటాయించాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. ఎవరికీ వారు తమ పార్టీకే పొత్తులో సీట్లు వచ్చాయని అభ్యర్థుల పేర్లతో సహా సోషల్ విూడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఖరారు కానీ పొత్తులు, సీట్ల విషయంలో జరుగుతున్న సోషల్ విూడియా ప్రచారం ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. ఫలానా సీట్లలో ఫలానా వ్యక్తి అంటూ పోస్టింగ్‌లు పెడుతున్నారు. దీంతో ఇందులో నిజమెంతో అబద్దమెంతో తెలియర అయోమయానికి గురవుతున్నారు. మళ్లీ కేసీఆర్‌నే సీఎంగా చేయడం ద్వారా మరింత ప్రగతిని, సంక్షేమాన్ని పొందేందుకు సహకరించాలనే రీతిలో ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు కేవలం టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మినహా వారికి చెప్పుకోవడానికి బలమైన అంశాలేవీ సుదూరంలో కూడా కనిపించడంలేదు. ఒక వేళ తమ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిస్తే ఎలా ముందుకు వెళ్లాలనే అంశంలో కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒక స్పష్టమైన వైఖరికి రాలేదు. సీఎం కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాల పరంపర నిరంతరం కొనసాగాలనే ఆలోచనతోనే ఎన్నికల బరిలో నిలవడంతో జిల్లా వ్యాప్తంగా గులాబీ తనదైన వేగంతో దూసుకుపోతుండగా, ప్రతిపక్ష పార్టీలు అస్పష్టమైన వైఖరులతో అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. సీఎం కేసీఆర్ టిఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించడంతో జిల్లాలో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.