సౌదీ రాజు అబ్దుల్లా కన్నుమూత

3

నిరాడంబరంగా అంత్యక్రియలు

సౌదీ ప్రజలు మంచి నాయకున్ని కోల్పోయారు-ప్రణభ్‌

రియాజ్‌,జనవరి 23 (జనంసాక్షి): సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. పెద్దవయసులో రాజ్యాధికార భారం తలకెత్తుకున్న ఆయన అత్యంత జాగరూకతతో దేశాన్ని ముందుకు నడిపించేందుకు కృషిచేశారని పేరొందారు. సంప్రదాయాన్ని, ఆధునికతన్ని సమన్వయం చేస్తూ పాలన సాగించడానికి ఆయన యత్నించారు. గత డిసెంబరు నుంచి ఊపిరితిత్తుల అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కింగ్‌ అబ్దుల్లా శుక్రవారం కన్నుమూశారని, ఆయన వారసుడిగా తాను పాలనా పగ్గాలు చేపట్టినట్లు అబ్దుల్లా సోదరుడు, నిన్నటివరకు క్రౌన్‌ ప్రిన్స్‌గా ఉన్న సల్మాన్‌ ఒక ప్రకటన విడుదలచేశారు.

సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సంతాపం తెలియజేశారు. భారత్‌తో సౌదీ కింగ్‌ అబ్దుల్లాకి సత్సంబంధాలున్నాయని ఈ సందర్భంగా ప్రణబ్‌ గుర్తుచేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించడానికి అబ్దుల్లా ఎంతో కృషి చేశారన్నారు. సౌదీ అరేబియా ప్రజలు మంచి నాయకుడిని కోల్పోయారని ప్రణబ్‌ పేర్కొన్నారు. అబ్దుల్లా మృతి పట్ల సంతాపం తెలుపుతూ ప్రణబ్‌ ట్వీట్‌ చేశారు.