స్టాలిన్‌ను అరెస్టు చేసిన పోలీసులు

డీఎంకే మద్దతుదారులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం
సీఎం, డీజీపీ రాజీనామా చెయ్యాల‌ని డిమాండ్‌
చెన్నై: స్టెరిలైట్‌ ఘటనకు నిరసనగా తమిళనాడు సెక్రటేరియట్‌ ముందు ఆందోళన చేస్తున్న డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరికొంతమంది డీఎంకే, ఇతర పార్టీల నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను ఎక్కించిన పోలీస్‌ వాహనాన్ని కదలనీయకుండా డీఎంకే మద్దతుదారులు అడ్డుగా నిలబడ్డారు. దీంతో డీఎంకే మద్దతుదారులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఆందోళన సమయంలో స్టాలిన్‌ మీడియాతో మాట్లాడుతూ.. పళనిస్వామి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా.. ఇంతవరకూ నిందితులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పళనిస్వామి, డీజీపీ రాజేంద్రన్‌ వెంటనే రాజీనామా చెయ్యాలి’ అని స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు.

స్టెరిలైట్‌ రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా తమిళనాడులోని తూత్తుకుడిలో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది మృతి చెందారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆందోళనల దృష్ట్యా కర్మాగారానికి విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేయాల్సిందిగా తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది.