స్టీల్‌ప్లాంట్‌కు పునాది పడేవరకూ గడ్డం తీయను
– తిరుమలో ఎంపీ సీఎం రమేశ్ శపథం
తిరుమల, జులై9(జనం సాక్షి) : విభజన చట్టంలో పేర్కొన్నట్టు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేవరకు తాను గడ్డం తీయనని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ శపథం చేశారు. తిరుమల శ్రీవారిని ఎంపీ సీఎం రమేశ్ సోమవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయానికి చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రమేశ్‌కు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు. స్వామివారి దర్శనం తర్వాత విూడియాతో మాట్లాడిన సీఎం రమేశ్.. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం తలపెట్టిన దీక్షను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. దీక్ష చేపట్టిన నాటి నుంచి ఎలాంటి ఆహారం తీసుకోలేదని, కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నానని తెలియజేశారు. ఇక స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి పునాది వేసే వరకు గడ్డం తీయబోనని శ్రీవారికి మొక్కుకున్నట్టు వెల్లడించారు. అంతవరకు గడ్డం తీయబోనని శపథం చేశారు. ఇక రాజకీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనున్నట్టు తెలిపిన ఆయన, మంగళవారం అనంతపురంలో జరిగే పార్టీ కార్యక్రమంలో పాల్గొంటానని పేర్కొన్నారు. విభజన చట్టంలోని హావిూల్లో భాగంగా కడపలో స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. జూన్ 20 న ప్రారంభించిన దీక్షను 11 రోజులపాటు కొనసాగించారు. సీఎం రమేశ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ 30 దీక్ష విరమింపజేయించారు.