స్టెరిలైట్‌పై తమిళనాడులో రణరంగం

– కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన నిరసన కారులు
– పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ
– ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు
చెన్నై, మే22(జ‌నం సాక్షి ) : వివాదాస్పద స్టెర్‌లైట్‌ రాగి కర్మాగారాన్ని వ్యతిరేకిస్తూ తూత్తుకుడి కలెక్టరేట్‌ వద్ద నిరసనకారులు చేపట్టిన ర్యాలీ రణరంగాన్ని తలపించింది.  పట్టణంలో 144 సెక్షన్‌ విధించినప్పటీకీ.. మంగళవారం పెద్ద ఎత్తున నిరసనకారులు కలెక్టరేట్‌ వద్దకు దూసుకువచ్చారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా… మరో ఆరుగురు గాయపడ్డారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళన కారులు కలెక్టరేట్‌లోకి చొరబడి నిప్పుపెట్టారు.రాగిని కరిగించే స్టెర్‌లైట్‌ యూనిట్‌ కార్యకలాపాలు నిలిపివేయాలంటూ నిరసనకారులు ఆందోళనకు పిలుపునివ్వడంతో వందల సంఖ్యలో ప్రజలు మంగళవారం కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు తూత్తుకుడి పట్టణంలో షాపులు మూసివేసి స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. ఈ నేపథ్యంలో పట్టణంలో 144 సెక్షన్‌ విధించిన జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్‌… కేవలం ఓల్డ్‌ బస్టాండ్‌ సవిూపంలోని ఎస్‌ఏవీ మైదానంలో మాత్రమే ఆందోళన తెలిపేందుకు అనుమతి ఇచ్చారు. అయితే నిషేధాజ్ఞలను పెడచెవిన నిరసనకారులు పెట్టి కలెక్టరేట్‌ వైపు దూసుకొచ్చారు. రాగి కర్మాగారాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులను నిలువరించేందుకు దాదాపు 4 వేల మంది పోలీసులను మోహరించాల్సి వచ్చింది. అయినప్పటికీ కొందరు పోలీసు వలయాన్ని ఛేదించుకుని కలెక్టరేట్‌లోకి ప్రవేశించడంతో… లాఠీచార్జి చేసి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు.