స్టెరిలైట్‌ విస్తరణకు భూకేటాయింపు రద్దు

– వెల్లడించిన ఎస్‌ఐపీసీవోటీ 
చెన్నై, మే29(జ‌నం సాక్షి) : తీవ్ర ఆందోళనల నేపథ్యంలో తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న స్టెరిలైట్‌ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా పరిశ్రమ విస్తరణ కోసం కేటాయించిన భూ అనుమతులను కూడా రద్దు చేశారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భూకేటాయింపులను రద్దు చేయాలని తమిళనాడు ఇండస్టీస్ర్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎస్‌ఐపీసీవోటీ) నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది.వేదాంతా లిమిటెడ్‌కు చెందిన రాగి పరిశ్రమ విస్తరణ(ఫేజ్‌ 2) కోసం కేటాయించిన భూ అనుమతులను రద్దుచేశామని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మొత్తం 342.22 ఎకరాల భూకేటాయింపులను ఉపసంహరించుకున్నామని ఈ విషయాన్ని కంపెనీకి కూడా వెల్లడించామని అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం ఆ కేటాయింపుల కోసం తీసుకున్న భూమి ధరను తిరిగి చెల్లిస్తామని ఎస్‌ఐపీసీవోటీ ప్రకటన ద్వారా తెలిపింది. స్టెరిలైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా ఇటీవల తూత్తుకుడిలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు కాల్పులు జరపగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇది మరింత వివాదాస్పదంగా మారింది. విపక్షాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో స్టెరిలైట్‌ పరిశ్రమ శాశ్వత మూసివేతకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తూత్తుకుడి ఘటన నిరసిస్తూ ప్రజాసంఘాల నిరసన
తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగిన కాల్పుల ఘటనలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం విజయవాడలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పర్యావరణాన్ని దెబ్బతీసే పరిశ్రమను మూసివేయాలని తూత్తుకుడిలో ఆందోళన చేస్తుంటే వారిపై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజా సంఘాల నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు. అభివృద్ధి ప్రజా సంక్షేమానికి దోహదపడేలా ఉండాలి కానీ.. ప్రజలకు, పర్యావరణానికి హాని చేకూర్చేలా ఉండకూడదన్నారు. పర్యావరణాన్ని నాశనం చేసే పరిశ్రమలను ప్రభుత్వాలు తక్షణమే మూసివేయాలని డిమాండ్‌ చేశారు.