స్టెరిలైట్‌ విస్తరణకు మద్రాస్‌ హైకోర్టు బ్రేక్‌

ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే విస్తరణకు పర్యావరణ అనుమతులు 
కేంద్ర ప్రభుత్వానికి సూచన
తుత్తుకూడిలో కొనసాగుతున్న బంద్‌
బాధితులకు ప్రముఖుల పరామర్శ..శాంతిభద్రతలపై సిఎస్‌ సవిూక్ష
చెన్నై,మే23( జ‌నం సాక్షి):  తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ విస్తరణ పనులను తక్షణమే నిలిపివేయాలని మద్రాస్‌ హైకోర్టు బుధవారం స్టే జారీ చేసింది. దీనిపై ప్రజల్లో ఆందోళన చెలరేగం, కాల్పులకు దారితీసయడంతో హైమైకోర్టు జోక్యం చేసుకుంది. ఈ మేరకు వేదాంత గ్రూప్‌నకు ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క తూత్తుకుడిలో ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే స్టెరిలైట్‌ విస్తరణకు సంబంధించిన పర్యావరణ అనుమతులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. నాలుగు నెలల్లోపు ఈ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పటివరకు ఏటా 4,00,000 టన్నుల రాగిని ఉత్పత్తి చేసే కర్మాగారాన్ని ఇక్కడ స్టెరిలైట్‌ నిర్వహిస్తోంది. దాదాపు మరో రూ.3,000 కోట్లు వెచ్చించి ఇక్కడే మరో రాగి ప్లాంట్‌ నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే కాలుష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న స్థానికులు పరిశ్రమ విస్తరణను వ్యతిరేకిస్తూ మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో దాదాపు 11 మృతి చెందారు. పోలీస్‌ కాల్పుల్లో మృతి చెందిన వారి దేహాలను భద్రపర్చిన ఆసుపత్రి వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వారి మృత దేహాలను తీసుకునేందుకు బంధువులు నిరాకరించి ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు బాధితులను పరామర్శించేందుకు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే సినీనటుడు, ఎంఎన్‌ఎం పార్టీ అధినేత కమల్‌హాసన్‌ క్షతగాత్రులను పరామర్శించారు. అయితే ఈ సందర్భంగా కమల్‌కు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ‘విూరు రావటం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం.. దయ చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ బాధితులు ఆయన్ను కోరారు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఈ నెల 25 తేదీన అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపునిచ్చింది. తూత్తుకుడిలో పోలీస్‌ కాల్పుల ఘటన ‘కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్‌’ అని పీఎంకే చీఫ్‌ అన్బుమణి రామదాస్‌ ఆరోపించారు. అక్కడి ఎస్పీ, కలెక్టర్‌, డీజీపీ, ప్రధాన కార్యదర్శులను సస్పెండ్‌ చేసి వారిపై హత్యానేరం కింద విచారణ జరపాలన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పళనిస్వామి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
కొనసాగిన బంద్‌
తమిళనాడులోని తూత్తుకుడిలో పోలీసు కాల్పులను ఖండిస్తూ ప్రజాసంఘాలు,రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్‌ కొనసాగుతోంది. వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నాయి. మరోవైపు ఐదుగురు ఐపీఎస్‌ అధికారుల నేతృత్వంలో భారీగా బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2వేలమంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. తూత్తుకుడిలో హింసాత్మక ఘటనతో 40మంది పోలీసు అధికారులపై డీజీపీ బదిలీ వేటు వేశారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తూత్తుకుడిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సవిూక్షించారు. అలాగే బుధవారం జరిగే అన్ని పరీక్షలు రద్దు అయ్యాయి. డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌, సినీనటుడు కమల్‌హాసన్‌ నేడు తూత్తుకుడిలో పర్యటించి, బాధితులను పరామర్శించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లాల్సిన కమల్‌ తన బెంగళూరు పర్యటన రద్దు చేసుకుని నేడు తూత్తుకుడి వెళ్లారు. కాగా తూత్తుకుడి స్టెర్‌లైట్‌ పరిశ్రమను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నిర్వహించిన ర్యాలీ, రాళ్లదాడి, లాఠీచార్జి, పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా 11మంది దుర్మరణం చెందారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం సైతం అగ్నికీలల్లో చిక్కుకుంది. యాభైకి పైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి.