స్తంభించిన కడప
– సంపూర్ణంగా కొనసాగిన కడప బంద్
– స్వచ్ఛందంగా మూతపడ్డ దుకాణాలు
– డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు..
– మూతపడ్డ విద్యాలయాలు
– ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని నినాదాలు
– ఉద్యమం ఉదృతం కాకముందే కేంద్రం దిగిరావాలి
– సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు
కడప, జూన్29(జనం సాక్షి ) : కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన శుక్రవారం కడప జిల్లా బంద్ ప్రశాంతంగా సాగుతోంది. తెల్లవారుజామునే సీపీఎం, సీపీఐ, వైసీపీ రాష్ట్ర నాయకులు రోడ్లపైకి వచ్చి బంద్‌లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది డిపోల్లోని బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేకపోవడంతో బస్టాండు ప్రాంగణాలన్నీ బోసిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు బస్సుల్లేక ఇబ్బందులు పడ్డారు. ఎలాంటి అవాంఛయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని దుకాణాలను మూసివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు బంద్ పాటిస్తున్నారు. రోడ్లపైకి వచ్చిన వాహనాలను ఆందోళనకారులు నిలిపేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంద్ కారణంగా కడప నగరమంతా నిర్మానుష్యంగా మారింది. బద్వేలులో ఉదయాన్నే అఖిలపక్షం ఆధ్వర్యంలో జెండాలను పట్టుకుని ఉద్యమకారులు రోడ్డు పైకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ఆర్టీసీ బస్సులు,అద్దె బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. దీంతో బస్టాండు నిర్మానుష్యంగా మారింది. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా గట్టి పోలీసు భద్రతను వేశారు. ప్రొద్దుటూరులో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. తెల్లవారుజామున నుంచే ఆందోళనకారులు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుని బంద్ నిర్వహించారు. బస్సులను, ఇతర వాహనాలను కదలనీయకుండా అడ్డుకున్నారు. సీపీఐ, సీపీఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, జనసేన, ఇతర సంఘాల నేతలు బంద్‌లో పాల్గొన్నారు. వ్యాపార పట్టణమైన ప్రొద్దుటూరులో వ్యాపారస్తులు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సంఘీభావం తెలిపారు. రవాణా వ్యవస్థ ఆగిపోవడంతో బంద్ వాతావరణం స్పష్టంగా కనిపిచింది. చిరు దుకాణాలు, ¬టళ్లు కూడా తెరవకపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మైదుకూరులో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఉక్కు పరిశ్రమ సాధనకై జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీతో పాటు ఇతర అఖిలపక్ష నేతలు బంద్‌లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఇరంగం రెడ్డి, వామపక్ష నేతలు జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పులివెందలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పులివెందులలో ఉక్కు నినాదం ¬రెత్తింది. విభజన చట్టంలో హావిూల అమలను డిమాండ్ చేస్తూ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. బస్టాండ్ వద్ద బైఠాయించారు. అనంతరం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా రాయచోటిలో అఖిలపక్షం పిలుపు మేరకు ఉక్కుసంకల్పం పేరుతో బంధ్ ప్రశాంతంగా సాగింది. ఆర్టీసి డిపో ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు భైఠాయించారు. బంద్ సందర్భంగా విద్యాసంస్థలు ఒక రోజు ముందే సెలవు ప్రకటించాయి. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు మదన్‌మోహన్ రేడ్డి, జిల్లా బీసీ ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్, సీపీఐ నాయకులు విశ్వనాథ్, వైఎస్సార్ మున్సిపల్ కౌన్సిలర్‌లు బంద్‌లో పాల్గోన్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ ఇతర నేతలు, కార్యకర్తలు సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీ కార్యకర్తలు బంద్‌లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. జమ్మలమడుగులోనూ బంద్ ప్రశాంతంగా సాగింది. సీపీఐ, సీపీఎం నేతలు, వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు బంద్ నిర్వహించారు. వామపక్షాలు, జనసేనలు వైఎస్సార్‌సీసీ తలపెట్టిన బంద్‌కు మద్దతు తెలిపాయి. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీ కార్యకర్తలు బంద్‌లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ బంద్‌లో కడప మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల అంజాద్ బాషా, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, జనసేన జిల్లా నాయకుడు రంజిత్ సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య నగర కార్యదర్శి వెంకట శివ పాల్గొన్నారు.
ఉద్యమం తీవ్రతరం కాకముందే కేంద్రం దిగిరావాలి – రాఘవులు
ఉద్యమం తీవ్రతరం కాకముందే కేంద్రం దిగొచ్చి ఉక్కు ఫ్యాక్టరీని ప్రకటించాలని సిపిఎం పోలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పాల్గొన్నారు. కడపలో ఉక్కు సాధన కోసం అఖిల పక్ష ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన జిల్లా బంద్లో పాల్గొన్న ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు ఉద్యమం తీవ్రతరం కాకముందే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖ ఉక్కుసాధన కోసం ఆనాడు ఎలాంటి పోరాటం చేసి సాధించుకున్న అదే తరహాలో కడప ఉక్కు సాధన కోసం అఖిలపక్షంలో పోరాటం సాగిస్తున్నామన్నారు. పరిశ్రమ ఏర్పాటుచేయకపోతే తెలుగు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. టిడిపి బిజెపి ప్రభుత్వాలు తెలుగు ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాయని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు