స్తంభించిన లావాదేవీలు 

– రెండోరోజూ దేశవ్యాప్తంగా బ్యాంకుల బంద్‌
– ఏటీఎంలలో నగదులేక ప్రజల ఇక్కట్లు
న్యూఢిల్లీ, మే31(జ‌నం సాక్షి) : వేతన సవరణ డిమాండ్‌తో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె రెండోరోజు కొనసాగుతోంది. గురువారం కూడా ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో బ్యాంకు సేవలు స్తంభించాయి. శుక్రవారం ఉదయం 6 గంటల వరకు ఈ సమ్మె కొనసాగనుంది. అనంతరం బ్యాంకు కార్యకలాపాలు యథావిథిగా సాగుతాయని బ్యాంకింగ్‌ యూనియన్‌ పేర్కొంది. తాము చేపట్టిన సమ్మె విజయవంతమైందని, అన్ని బ్యాంకులు, బ్రాంచీల్లోని ఉద్యోగులు ఉత్సాహంగా సమ్మెలో పాల్గొన్నారని యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) తెలిపింది. కేవలం 2శాతం వేతన పెంపు మాత్రమే చేయడాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు సిబ్బంది రెండు రోజుల సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 13 పాతతరం ప్రైవేటు రంగ బ్యాంకులు, ఆరు విదేశీ బ్యాంకులు, 56 ప్రాంతీయ గ్రావిూణ బ్యాంకుల్లోని 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నట్లు అఖిల భారత ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. తొలి రోజు సమ్మె నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. దీంతో రిజిస్టేష్రన్లు, ట్రెజరీ, వ్యాపార లావాదేవీలు నెమ్మదించాయి. బుధవారం ఉదయం 6గంటలకు ప్రారంభమైన ఈ సమ్మె శుక్రవారం ఉదయం 6 గంటలతో ముగియనుంది.
బ్యాంకులు యథావిధిగానే..
మరోవైపు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి కొత్తతరం ప్రయివేటు రంగ బ్యాంకులు మాత్రం ఈ సమ్మెకు దూరంగా ఉన్నాయి. ఆయా బ్యాంకుల్లో కార్యకలాపాలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. అయితే చెక్కు క్లియరెన్స్‌ వంటి కొన్ని సేవలు మాత్రం జరగట్లేదని సమాచారం. అధికారిక లెక్కల ప్రకారం.. మొత్తం దేశంలోని శాఖల్లో కేవలం 25 శాతం మాత్రమే పనిచేశాయి.