స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో చలనం

హైకోర్టు ఆదేశాలతో అప్రమత్తం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి): స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలతో రాజకీయ పార్టీలలో ఒక్కసారిగా చలనం కలిగింది. ఏపార్టీకి ఆ పార్టీ ఎన్నికలను ధీటుగా ఎదుర్కొంటామని తమ సత్తా చాటతామని ధీమాగా ప్రకటించాయి. అందుకు అనుగుణంగా ఇప్పటినుంచే వ్యూహరచనలో ముందుకు కదులుతున్నాయి. స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలతో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చాలా కాలంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌చేస్తూ వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి కాంగ్రెస్‌ పార్టీ భయపడుతోందని విమర్శిస్తోంది. ఉప ఎన్నికల్లో సత్తా చాటిన వైయస్పార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తన బలాన్ని కూడగట్టుకోవాలని, దాన్ని నిర్ధారించుకోవాలని చూస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో ఇప్పటికే గణనీయంగా బలాన్ని సమకూర్చుకున్న వైయస్సార్‌పార్టీ తెలంగాణలో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొవడానికి ఇప్పటికే వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో పావులు కదుపుతూ వస్తోంది. ఈ ప్రాంతంలోని కొందరు ముఖ్యనేతలను ఇప్పటికే సంప్రదించింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌, టిడిపిల నుంచి కొందరు నేతలు జగన్‌పార్టీలోకి వలసలు ప్రారంభించారు. ఎన్నికలు సమీపించే నాటికి తెలంగాణ ప్రాంతంలోని ఇతర పార్టీలోని నాయకులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో వైయస్సార్‌ సిపీలోకి వచ్చేలా ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇందుకు స్థానిక సంస్థలనే ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా, తెలంగాణలో టిఆర్‌ఎస్‌ మరోసారి తన సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. హైకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే ఆ పార్టీనేతలు స్పందించారు. తక్షణమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని టిఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌, ఉపనేత హరీష్‌రావ్‌ మంగళవారం నాడు డిమాండ్‌ చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో పరకాలలో సాధించిన విజయం స్ఫూర్తిగా తెలంగాణాపై మరింతపట్టు సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. నేడో, రేపో తెలంగాణ వస్తుందంటూ పార్టీ శ్రేణులతో పాటు, ఈ ప్రాంత ప్రజలపై పట్టు సడలకుండా ఉండేలా టిఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే వచ్చే స్థానిక ఎన్నికలలో కూడా ఘనవిజయం సాధించి తెలంగాణలో తన పట్టును మరింత బిగించేలా కార్యక్రమాల రూపకల్పన చేయాలని పార్టీ అధినేతలు భావిస్తున్నారు. అలాగే తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించడం ద్వారా టిఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొవడానికి తెలుగుదేశంపార్టీ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణపై కేంద్రానికి మరోసారి లేఖ రాసే అంశంపై చంద్రబాబు విస్తృతంగా పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. సెప్టెంబర్‌ 2వ వారం నాటికి తెలంగాణపై స్పష్టత ఇస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
2014 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని టిడిపి అధినేత దూకుడు పెంచారు. ఈ లోపుగానే స్థానిక ఎన్నికలు రావడం ఆ పార్టీకి కొంత కలిసోచ్చే అవకాశం. అసెంబ్లీ ఎన్నికలకు ముందే తమ పార్టీ బలాబలాలను అంచనా వేసుకునేందుకు స్థానిక ఎన్నికలు ఎంతగానో ఆ పార్టీకి ఉపకరిస్తాయని భావిస్తున్నారు. వీటి ద్వారా పార్టీలో ఉన్న లోసుగులను సరిదిద్దుకుని అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టపరిచే అవకాశం ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే విద్యుత్‌, విద్యార్థి ఫీజులు, ఇతర ప్రజా సమస్యలపై టిడిపి పోరాటానికి సిద్ధపడింది. అక్టోబర్‌నుంచి అధినేత చంద్రబాబు కూడా పూర్తి కాలం ప్రజలతో మమేకమవుతూ ప్రజా క్షేత్రంలో ఎక్కువ సమయం గడిపేలా కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవడం ద్వారా పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడంతోపాటు ప్రభుత్వానికి కూడా హెచ్చరిక పంపెందుకు వీలవుతుందని భావిస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీకి మాత్రం ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తోంది. స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తామని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ తెలిపారు. కోర్టు ఆదేవాలు రాజ్యాంగం మేరకు రిజర్వేషన్లను అమలు పరిచి ఎన్నికలు త్వరలో నిర్వహిస్తామని చెప్పారు. అయితే స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ మెజారిటీ స్థానాలను సాధించి గ్రామాలలో తమకున్న పట్టు నిరూపించుకుంటామని మంత్రి శైలాజనాథ్‌ ధీమా వ్యక్తం చేశారు. మూడు నెలల్లో ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కూడా ధీమాగా ప్రకటించారు.