స్థాయీ సంఘాల సదస్సులో మార్మోగిన జై తెలంగాణ
ప్రభు(త్వ) భక్తితో ఉప్పొంగిన పొంగులేటి
ఫెర్నాండేజ్ జోక్యంతో సద్దుమణిగిన వివాదం
మెదక్, మార్చి 5 (జనంసాక్షి):
శాసన సభ స్థాయి సంఘాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహిస్తున్న అవగాహన సదస్సు ఉద్రిక్తతంగా మారింది. తెలంగాణ అంశంపై కేంద్ర మంత్రి వాయలర్ రవి చేసిన వ్యాఖ్యలపై సదస్సు అట్టుడికింది. తెలంగాణ అంశాన్ని దోశ, కాఫీలంటూ కేంద్ర మంత్రులు ఎగతాళిగా మాట్లాడతారా? అంటూ టీఆర్‌ఎస్‌తో పాటు తెలంగాణకు చెందిన పలువురు నేతలు ప్రశ్నించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్‌ను నిలదీశారు. మంగళవారం పటాన్‌చెరు మండలం భానూరు గ్రామం లహరి రిసార్ట్స్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి శాసన సభ, మండలి సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్
ఫెర్నాండేజ్ పాల్గొన్నారు. స్థాయి సంఘాలపై జరుగుతున్న అవగాహన సదస్సులో పలువురు సభ్యులు తెలంగాణ నినాదాలు చేశారు. సభ్యులనుద్దేశించి ఆస్కార్ ఫెర్నాండేజ్ మాట్లాడుతున్న సమయంలో తెరాస ఎమ్మెల్యేలు తెలంగాణ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వీరికి తెలంగాణ నగారా సమితి నేత నాగం జనార్దన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం దోశ వేసినంత సులభం కాదని వాయలర్ రవి వ్యాఖ్యానించడాన్ని నిరసిస్తూ సదస్సును స్తంభింపజేశారు. సమస్య తీవ్రంగా ఉంటే దోశ, కాఫీలంటూ ఎగతాళిగా మాట్లాడతారా? అని హరీశ్‌రావు మండిపడ్డారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను దోశతో పోల్చడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వాయలర్ రవి గతంలోనూ తెలంగాణపై వ్యంగ్యంగా మాట్లాడారని ఆరోపించారు. తమ మనోభావాలు కించపర్చేలా మాట్లాడిన వాయలర్ రవి వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఇంత మంది చనిపోతున్నా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోదా? అని నిలదీశారు. తెలంగాణను దోశతో పోల్చి అవమానపరిచారంటూ ధ్వజమెత్తారు. అయితే, ఆయన ప్రసంగానికి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడ్డు తగిలారు. సదస్సులో తెలంగాణ అంశం ప్రస్తావన ఎందుకు అని అభ్యంతరం తెలిపారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్‌రావు.. తెలంగాణను అవమానిస్తున్నా తెలంగాణ కాంగ్రెస్ నేతలు పట్టించుకోరా అని నిలదీశారు. తామ తెలంగాణవాదంపైనే గెలిచామని, తమ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని స్పష్టం చేశారు. తమ ఎజెండానే తెలంగాణ అంశమని, మరొకటి మాట్లాడనని స్పష్టం చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. తాము రాత్రికి రాత్రే తెలంగాణ ఇవ్వమని డిమాండ్ చేయడం లేదని, కానీ, గతంలో ఇచ్చిన హావిూని నిలబెట్టుకోవాలని కోరుతున్నామని తెలిపారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కరీంనగర్‌లో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ పదవి కోసమే పొంగులేటి తమను ప్రశ్నిస్తున్నారని ధ్వజమెత్తారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో
ఆస్కార్ ఫెర్నాండెజ్ జోక్యం చేసుకున్నారు. తెలంగాణ అంశాన్ని తాను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని, వీలైనంత తొందరగా సమస్య పరిష్కరించాలని కోరతానని చెప్పారు. తెలంగాణకు సంబంధించి అన్ని విషయాలు కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసన్నారు. తెలంగాణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పారని, వేచి చూద్దామని ఆస్కార్ ఫెర్నాండెజ్ అన్నారు. సమస్య పరిష్కారానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు. ఆయన సర్దిచెప్పడంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శాంతించారు.