స్నేక్‌ గ్యాంగ్‌కు యావజ్జీవ ఖైదు

3

హైదరాబాద్‌,మే11(జనంసాక్షి): మహిళలు,పర్యాటకులపై అకృత్యాలకు పాల్పడుతూ రాక్షసకృత్యాలకు పాల్పడుతున్న స్నేక్‌గ్యాంగ్‌లోని ఏడుగురికి రంగారెడ్డి జిల్లా కోర్టు యావజ్జీవ జైలుశిక్ష ఖరారు చేసింది. వీరి అకృత్యాలపై లోతుగా పరిశీలించిన కోర్టు వీరికి యావజ్జీవం సరైనదిగా భావించి శిక్షను ఖరారు చేసింది.  మొత్తం తొమ్మిది మంది నిందితుల్లో 8 మందిని న్యాయస్థానం నేరస్థులుగా నిర్ధారించింది. సరైన ఆధారాలు లేవంటూ మరొకరిపై కేసు కొట్టేసింది. ఏ1 నుంచి ఏ7 నిందితులకు యావజ్జీవ శిక్ష, ఏ8 నిందితుడికి 20 నెలల జైలు శిక్ష విధించింది. ఈ గ్యాంగ్‌ సుమారు 37 మంది యువతులను పాములతో బెదిరించి దోపిడీ, లైంగిక అకృత్యాలకు పాల్పడిందని న్యాయస్థానం నిర్ధారించింది. ఈ కేసులో బుధవారం తుది వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా స్నేక్‌గ్యాంగ్‌ ఆగడాలపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. వీరు చేసిన నేరాలు దిగ్భాంతికి గురిచేశాయని వ్యాఖ్యానించారు. మహిళలపై వీరు వ్యవహరించిన తీరును న్యాయమూర్తి తీవ్రంగా ఆక్షేపించారు. దీంతో వారికి యావజ్జీవ శిక్ష విధించారు. నిందితుల కుటుంబ నేపథ్యం, పేదరికాన్ని పరిగణనలోకి తీసుకుని శిక్ష తగ్గించాలని నిందితులు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. నేరాలు చేసినప్పుడు విూ నేపథ్యం గుర్తుకురాలేదా? అని న్యాయమూర్తి ప్రశ్నించినట్లు సమాచారం. నేరస్థుల కుటుంబ నేపథ్యం కాకుండా.. జరిగిన నేరాలను పరిగణనలోకి తీసుకుని శిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానంస్పష్టం చేసింది.  పహాడీషరీఫ్‌ పోలీస్‌ ఠాణా పరిధిలో 2014, జులై 31న స్నేక్‌గ్యాంగ్‌ సభ్యులు ఫాంహౌజ్‌లోకి చొరబడి ఓ యువతిని పాముతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై ఐపీసీ 376డి, 341, 323, 395, 506, 212, 411 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం తొమ్మిది మంది నిందితులపై కోర్టులో పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేశారు. ఈ గ్యాంగ్‌ మరికొంత మంది యువతులను ఇదే విధంగా బెదిరించి వారిని దోపిడీ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. అంతేగాకుండా యువతిని పాముతో బెదిరించి వీడియో తీశారు. వారివద్ద నుంచి రూ.60 వేల నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఈ గ్యాంగ్‌ వికృత చేష్టలపై పహాడీ షరీఫ్‌ పోలీసులు కేసులు నమోదుచేశారు. ముఠా సభ్యులుగా ఉన్న ఫైసల్‌ దయానీ, ఖాదర్‌ బరాక్‌, తయ్యబ్‌ బసలమ, మహ్మద్‌ పర్వేజ్‌, సయ్యద్‌ అన్వర్‌, ఖాజా అహ్మద్‌, మహ్మద్‌ ఇబ్రహీం, అలీ బరాక్‌, సలాం హాండీలపై వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదుచేశారు. నిందితుల్లో ఐదుగురిపై పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. విచారణ సమయంలో నిందితులు బెదిరించే అవకాశాలు ఉండటంతో 21 మంది సాక్షులకు పోలీసులు పూర్తి భరోసా కల్పించి ఆధారాలు సమర్థంగా సేకరించారు. అరెస్ట్‌ అయిన తొమ్మిది మందిలో ఏడుగురు చర్లపల్లి జైలులో ఉండగా, మిగతా ఇద్దరు బెయిల్‌పై విడుదలయ్యారు. మంగళవారం నిందితులందరినీ కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

సమగ్రంగా దర్యాప్తు: సీవీ ఆనంద్‌

స్నేక్‌ గ్యాంగ్‌ అరాచకాలపై ప్రతి అంశంలోనూ సాక్షాధారాలు సమగ్రంగా సేకరించామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. పహాడిషరీఫ్‌ పోలీసు అధికారుల దర్యాప్తులో అన్ని సెక్షన్లలో ఆధారాలు లభించాయన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే

లేదన్నారు. ఈ కేసులో 21 మంది సాక్షులకు భద్రతపై పూర్తిస్థాయి భరోసా కల్పించామన్నారు. కేసుల నమోదుతోపాటు వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించి న్యాయస్థానం ముందు రుజువు చేస్తేనే పోలీసుల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని సీవీ ఆనంద్‌ అన్నారు. ఈ కేసు నమోదైనప్పటి నుంచి సాక్షాల సేకరణ, బాధితురాలికి భద్రత కల్పన, నిందితుల అరెస్ట్‌ నుంచి లభించిన సాక్షాధారాలను ఎఫ్‌ఎస్‌కు పంపి విశ్లేషణ నివేదిక సేకరించడంతోపాటు పూర్తిస్థాయి దర్యాప్తు చేసి న్యాయస్థానంలో సమగ్ర చార్జిషీట్‌ దాఖలు చేశామని ఆయన వివరించారు.