స్పిన్ పిచ్ రూపొందించడం కుదరదు బాధ్యతల నుండి తప్పుకున్న ఈడెన్ క్యూరేటర్
కోల్‌కత్తా ,నవంబర్ 28 భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్పిన్ పిచ్‌లపై ఆసక్తి క్రమంగా వివాదాలకు దారితీస్తోంది. ముంబై పిచ్‌లాంటివే మిగిలిన మ్యాచ్‌లకూ కావాలని ధోనీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ ఈడెన్ గార్డెన్స్‌పై పడింది. ధోనీ కోరికను బోర్డు మన్నించడంతో బీసిసిఐ పిచ్ కమిటీ ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్‌కు ప్రత్యేకంగా లేఖ రాసింది. డిసెంబర్ 5 నుండి జరగబోయే మూడో టెస్ట్ కోసం పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించే వికెట్‌ను తయారు చేయాలని ఆదేశించింది. అయితే ఈడెన్ పిచ్ క్యూరేటర్ ప్రబీర్ ముఖర్జీ మాత్రం తాను స్పిన్ పిచ్ రూపొందించలేనని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. రాత్రికి రాత్రే ఈడెన్ వికెట్ స్వభావాన్ని మార్చలేనని , కావాలంటే క్యూరేటర్ బాధ్యతల నుండి తప్పుకునేందుకు కూడా తాను సిధ్ధమని అతను చెప్పినట్టు సమాచారం. దీంతో బీసిసిఐ వైఖరిపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. స్వదేశీ పిచ్‌లను ఎలా కావాలంటే అలా రూపొందించుకోవడంలో తప్పులేదని , అయితే ఈ జాగ్రత్త సిరీస్ ప్రారంభం కాకముందే తీసుకుని ఉంటే బావుండేదని వ్యాఖ్యానిస్తున్నారు. ముంబై టెస్టులో ఘోరపరాజయం పాలైన తర్వాత కూడా భారత సారథి ధోనీ ఈడెన్‌లోనూ ఇలాంటి తరహా పిచ్‌నే కోరుకుంటున్నట్టు చెప్పాడు. టెస్ట్ క్రికెట్‌లో ఫలితాలు రావాలంటే వికెట్లు స్పిన్‌కు అనుకూలించే విధంగా ఉండాలని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో బీసిసిఆ పిచ్ కమిటీలో సభ్యునిగా ఉన్న ఆశిష్ భౌమిక్‌కు బీసిసిఐ ఈ బాధ్యతలు అప్పగించింది. ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్‌తో కలిసి స్పిన్ వికెట్ తయారు చేయాలని కోరింది. అయితే ఈడెన్ క్యూరేటర్ నిరాకరించడంతో వికెట్‌పై ఆసక్తి నెలకొంది. ఇప్పుడు బోర్డు క్యూరేటర్‌ను ఒప్పిస్తుందో… లేక మరొకరిని నియమించుకుంటుందో వేచి చూడాలి.