స్మార్ట్‌ సిటీ సాధించాం

4

– ఎంపీ వినోద్‌

– అమిత్‌షావి అవాస్తవాలు

– ఒక్కపైసా అదనంగా రాలేదు

– వేణుగోపాలచారి

దిల్లీ,జూన్‌ 16(జనంసాక్షి): స్మార్ట్‌ సిటీల జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి కరీంనగర్‌కు  చోటు దక్కిందని కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ తెలిపారు.ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసిందరి ఆయన తెలిపారు.కరీంనగర్‌ ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు ప్రజా ప్రతినిధులంతా కృషి చేయాలని ఎంపీ వినోద్‌ పిలుపునిచ్చారు. ఆకర్షణీయ నగరాల జాబితాలో కరీంనగర్‌కు స్థానం లభించేలా కృషి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ స్థానంలో కరీంనగర్‌కు స్థానం కల్పించాలని గతంలో సీఎం, ప్రధానికి తాను లేఖరాసినట్లు గుర్తు చేశారు. రూ.5వేల కోట్ల బడ్జెట్‌ ఉన్న హైదరాబాద్‌కు ఆకర్షణీయ నగరాల జాబితాలో స్థానం కల్పించడం వల్ల ప్రయోజనం ఉండదని అందువల్ల కరీంనగర్‌కు స్థానం కల్పించాలని కోరామని తెలిపారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించేందుకు కేంద్రం రూ.2కోట్లు మంజూరు చేసిందని అందుకు త్వరలో కరీంనగర్‌ ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించి డీపీఆర్‌ సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు.కాగా హైదరాబాద్‌ స్థానంలో కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీగా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో కేంద్రాన్ని కోరారు. దీంతో  కేసీఆర్‌ ప్రతిపాదనను పరిశీలించిన కేంద్రం అందుకు అంగీకారం తెలిపింది. కరీంనగర్‌ ను స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సుముఖత వ్యక్తం చేసింది. దీంతో స్మార్ట్‌ సిటీల జాబితా నుంచి హైదరాబాదును తొలగించి ఆ స్థానంలో కరీంనగర్‌ను చేర్చింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన వంద స్మార్ట్‌ సిటీల్లో తెలంగాణ నుంచి హైదరాబాద్‌, వరంగల్‌ నగరాలు ఉన్నాయి. అయితే రూ.100 కోట్ల నిధులు హైదరాబాద్‌కు  సరిపోవని, స్మార్ట్‌ సిటీ బదులు హైదరాబాద్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సిఎం కేంద్ర పట్టణాభివృద్ది శాఖకు ప్రతిపాదనలు పంపారు.  కరీంనగర్‌ నగరాన్ని స్మార్ట్‌ సిటీల జాబితాలో చేర్చుతూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేయడంపై ఎంపి వినోద్‌ ఆనందం వ్యక్తం చేశారు.  దీనిపై కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ స్పందిచారు. కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీల జాబితాలో చేర్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందు కోసం కృషి చేసిన సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీల జాబితాలో చేర్చాలని సీఎం కేసీఆర్‌ ప్రధాన మంత్రి మోదీని, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కోరారని గుర్తు చేశారు. కరీంనగర్‌ను గొప్ప స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతామని వినోద్‌ స్పష్టం చేశారు. ఈ మేరకునగర అభివృద్దికి పక్కా ప్రణాళికలు చేస్తామని అన్నారు. కరీంనగర్‌ అభివృద్దికి స్మార్ట్‌ సిటీ ప్రకటన ఎంతగానో దోహదపడగలదని అన్నారు.

నిధుల విడుదలలో అమిత్‌షా అవాస్తవాలు: చారి

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారని దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రాష్టాన్రికి అదనంగా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్టాన్రికి  రూ.96వేల కోట్లు మంజూరు చేయడం అవాస్తమని పేర్కొన్నారు. అమిత్‌షా చెప్పేది వాస్తవమైతే నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు, ఉద్యోగుల విభజన అంశాన్ని భాజపా విస్మరించిందని ధ్వజమెత్తారు. కరవు నిధులను కేంద్రం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విడుదల చేయలేదని వేణుగోపాలాచారి తెలిపారు. ఇదిలావుంటే తక్షణం కరువ నిధులు విడుదల చేయాలన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి మరోమారు వినతి పత్రం సమర్పించామని అన్నారు. నిధులు విడుదలలో జాప్యం చేస్తూ మభ్యపెట్టడం సరికాదన్నారు.