స్మృతికి సభా హక్కుల నోటీసులు

2A

– ఉభయ సభల్లో గందరగోళం

న్యూఢిల్లీ,మార్చి1(జనంసాక్షి): స్మృతీ ఇరానీ, కతేరియా అంశాలు పార్లమెంటు ఉభయ సభలను అట్టుడుకించాయి. దాంతో సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. స్మృతీ ఇరానీపై లోక్‌సభలో కాంగ్రెస్‌, రాజ్యసభలో బీఎస్పీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చాయి. అటు రాజ్యసభలో కేంద్ర సహాయమంత్రి కతేరియా వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఇటీవల హత్యకు గురైన వీహెచ్‌పీ నేత సంస్మరణ సభలో పాల్గొన్న కతేరియా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఆయన రాజీనామాకు విపక్షాలు పట్టుబట్టాయి. మరోవైపు తన పరువును భగ్నం చేశారంటూ కాంగ్రెస్‌ నేత జ్యోతిరాధిత్య సింధియాపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. మరోపక్క మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తనయుడు కార్తీ అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ అన్నాడీఎంకే సభ్యులు గందరగోళం సృష్టించారు. మొత్తానికి పరస్పర ఆరోపణలు విమర్వలతో సభలు దద్దరిల్లాయి.  కేంద్ర మంత్రి రామ్‌శంకర్‌ కతేరియా వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం రేగింది. ఇటీవల హత్యకు గురైన వీహెచ్‌పీ నేత అరుణ్‌ సంస్మరణ సభలో పాల్గొన్న కతేరియా ముస్లింలకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు  ఉభయసభల్లో ఆందోళన చేపట్టాయి. కతేరియా వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని కాంగ్రెస్‌ నేత సెల్జా కుమారి ఆరోపించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురిచేశాయని అన్నారు

ఇక ఏఐఏడీఎంకే సభ్యుల ఆందోళనతో రాజ్యసభ దద్దరిల్లింది. కార్తి చిదంబరానికి వ్యతిరేకంగా సభ్యులు నినాదాలు చేశారు. కార్తి చిదంబరానికి చెందిన సంస్థల్లో ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్తీ చిదంబరంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ అన్నాడీఎంకే సభ్యులు ఉభయ సభలను స్తంభింపజేశారు. ఎయిర్‌ సెల్‌-మాక్సిస్‌ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని అన్నాడీఎంకే ఎంపీలు డిమాండ్‌ చేశారు. దీనిపై తాత్సారం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలంటూ స్పీకర్‌ పోడియం వద్ద నినాదాలు చేశారు. రియల్‌ ఎస్టేట్‌ లో ప్రపంచవ్యాప్తంగా కార్తీ చిదంబరం పెట్టుబడులు పెట్టారని ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనం ప్రతులను సభలో ప్రదర్శించారు. దీనికి సంబంధించిన కాపీలకు బీజేపీ సభ్యులకు పంచిపెట్టారు.సభ నియమ నిబంధనలకు అనుగుణంగా నోటీసు ఇస్తే చర్చించేందుకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రకంచినా అన్నాడీఎంకే సభ్యులు శాంతించలేదు. తమ ఆందోళన కొనసాగించారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.అన్నాడీఎంకే ఎంపీలు పదేపదే అడ్డు తగలడంతో పార్లమెంట్‌ మొదలైన గంటలోనే ఉభయ సభలు రెండుసార్లు వాయిదా పడ్డాయి. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీపై పలు పార్టీలు సభ ఉల్లంఘన హక్కుల నీటీసులు ఇచ్చాయి. ఆమె పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని ఆరోపించాయి. దాంతో మంత్రి ఇబ్బందుల్లో పడినట్లు అయింది. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యకు సంబంధించి స్మృతీ ఇరానీ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని విపక్షాలు ఆరోపించాయి. దీంతో లోక్‌ సభలో ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యులు సభా ఉల్లంఘన హక్కుల నోటీసు ఇచ్చారు. అలాగే రాజ్యసభలో కూడా బీఎస్సీ సభా హక్కుల నోటీసు ఇచ్చింది. ఈ సందర్భంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం విూడియాతో మాట్లాడుతూ రోహిత్‌ వ్యవహారంలో మంత్రి స్మృతీ ఇరానీపై సభా హక్కుల నోటీసు ఇచ్చామని చెప్పారు. ఆమె సభను తప్పుదోవ పట్టించారని నిన్న నోటీసు ఇచ్చామని, మంగళవారం కూడా నోటీసు ఇచ్చామని ఆమె తెలిపారు. ఈ అంశాన్ని మా పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుందని మాయావతి పేర్కొన్నారు. దీనికి సంబంధించి మంత్రి సభలో క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.  రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నప్పుడు విద్యార్థులు కనీసం డాక్టర్‌ను కూడా సంఘటన ప్రదేశానికి రానివ్వలేదని స్మృతీ ఇరానీ ఇటీవల లోక్‌సభలో వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలను రోహిత్‌ తల్లి రాధికతోపాటు హెచ్‌సీయూ వైద్యాధికారి కూడా ఖండించారు. ఇప్పుడు ఇదే అంశం విపక్షాలకు అస్త్రంగా మారింది. వారు స్మృతీ ఇరానీపై హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.