స్వచ్ఛ పనుల్లో అలసత్వం తగదు: కలెక్టర్
కామారెడ్డి,డిసెంబర్5(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా స్వచ్చ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పూర్తి చేయాలని, స్పెషల్ ఆఫీసర్లు తమకు కేటాయించిన మండలాల్లో ఓడీఎఫ్ పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. గ్రామాల్లో తప్పనిసరిగా మరుగుదొ డ్లు నిర్మించుకోవాలని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్లు గ్రామాల్లో ఉండి పనులు పరిశీలించాలన్నారు. నిధుల సమస్య లేనందున ఆన్‌లైన్ నమోదు వంటి పనులు పూర్తి చేసుకోవాలని అన్నారు. ఉదయమే 6 గంటలకు స్పెషల్ ఆఫీసర్లు గ్రామాలకు చేరుకొని ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించిన చెక్కులను వెంటనే పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని సంక్షేమ శాఖల అధికారులు తమ పరిధిల్లోని హాస్టళ్లకు నీటి వసతి కోసం మిషన్ భగీరథ కనెక్షన్‌లకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత కోసం రిక్షాలను వినియోగించాలని తెలిపారు. ఇప్పటికే చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. తమకు కేటాయించిన లక్ష్యాన్ని ఆర్డీవోలు, తహసీల్దార్‌లు, మండల అభివృద్ధి అధికారులు సత్వరం పూర్తి చేసేలా చూడాలని అన్నారు. ఎంపీడీవోలు, గ్రామ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీల సమన్వయంతో ఓడీఎఫ్ పనుల్లో వేగం పెంచాలని తెలిపారు.