స్వదేశానికి మెక్‌కల్లమ్‌, రాస్‌టేలర్‌


లండన్‌ ,మే 3 (జనంసాక్షి):

ఐపీఎల్‌ ఆరోసీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతోన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌, పుణెళి వారియర్స్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ జట్టులో స్టార్‌ ఆటగాళ్ళు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌, రాస్‌ టేలర్‌ ఐపీఎల్‌ మధ్యలోనే తప్పుకోనున్నారు. జాతీయ జట్టు బిజీ షెడ్యూల్‌ దృష్ట్యా వీరిద్దరూ స్వదేశానికి బయలుదేరనున్నారు. ఈ మేరకు ఫ్రాంచైజీలు వారికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాయి. ప్రస్తుతం మెక్‌కల్లమ్‌ కోల్‌కత్తాకు, టేలర్‌ పుణెళికు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సీజన్‌లో ఒకే ఒక మ్యాచ్‌ ఆడిన మెక్‌కల్లమ్‌ త్వరలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు ఎంపికయ్యాడు. అటు రాస్‌ టేలర్‌ కూడా ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పుణెళి తరపున ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం 63 పరుగులే చేశాడు. ఇప్పటికే పలువురు న్యూజిలాండ్‌ క్రికెటర్లు ఇంగ్లాండ్‌ టూర్‌కు వెళ్ళిపోయారు. ఇవాళ మెక్‌కల్లమ్‌, టేలర్‌ నేరుగా లండన్‌ చేరుకోనున్నారు. అయితే వీరిద్దరూ సరైన సమయానికి చేరుకోవడంపై సందిగ్ధత నెలకొని ఉండడంతో డెర్బిషైర్‌తో జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు కివీస్‌ సారథ్యాన్ని కేన్‌ విలియమ్సన్‌ చేపట్టనున్నాడు.ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని ముందుగానే తమ ప్లేయర్లకు న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డ్‌ ఆంక్షలు విధించింది. ఐపీఎల్‌లో ఆడేందుకు కేవలం ఐదు వారాల వరకే అనుమతినిచ్చింది. ఇంగ్లాండ్‌ పర్యటనలో న్యూజిలాండ్‌ జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలతో పాటు రెండు టీ ట్వంటీలు ఆడనుంది. రెండు టెస్టుల సిరీస్‌ మే 16 నుండి ప్రారంభం కానుండగా… వెంటనే వన్డే సిరీస్‌ ఉంటుంది. అయితే మధ్యలో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఉండడంతో అది ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్లు రెండు టీ ట్వంటీల సిరీస్‌ ఆడనున్నాయి.