స్వల్పంగా తగ్గిన పెట్రో,  డీజిల్‌ ధరలు

– పెట్రోల్‌పై 7 పైసలు… డీజిల్‌పై 5 పైసలు తగ్గింపు
న్యూఢిల్లీ, మే31(జ‌నం సాక్షి) : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. బుధవారం ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటరుకు ఒక్క పైసా చొప్పున తగ్గించిన సంగతి తెలిసిందే. పెట్రోల్‌ ధరల పెరుగుదల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో బుధవారం ఒక్క పైస తగ్గింపు వారిని మరింత ఆగ్రహానికి గురిచేసింది. చమురు సంస్థలు గురువారం కూడా లీటర్‌ పెట్రోల్‌పై 7పైసలు, డీజిల్‌పై 5 పైసల చొప్పున తగ్గించాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.35గా, లీటరు డీజిల్‌ ధర రూ.69.25గా ఉన్నాయి. వరుసగా 16 రోజుల పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలను తాకగా బుధ, గురువారాల్లో మాత్రం ధరలు అత్యంత స్వల్పంగా తగ్గాయి. మంగళవారం రోజు పెట్రోల్‌ ధర రూ.78.43తో జీవన కాల గరిష్ఠానికి చేరింది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుతుండడంతో దేశీయంగా ధరలు తగ్గుతున్నాయి. మే 14 నుంచి వరుసగా 16 రోజుల పాటు ధరలు పెరుగుతూ ఉండడంతో పెట్రోల్‌ లీటరుకు రూ.3.8, డీజిల్‌ లీటరుకు రూ.3.38 చొప్పున పెరిగాయి. అన్ని రాష్ట్రాల రాజధానులు, మెట్రో నగరాల కంటే ఢిల్లీలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తక్కువగా ఉంటాయి.