స్వామినాథన్‌ సిఫార్సులను తుంగలో తొక్కారు

పవన్‌ కేంద్రాన్ని ఎందుకు విమర్శించరు: మంత్రి సోమిరెడ్డి

నెల్లూరు, జులై5(జ‌నం సాక్షి) : స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆంధప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించడంలో కేంద్రం దారుణంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ధాన్యం ఏ గ్రేడ్‌ రకానికి 3,472 కోరితే రూ.1,770, కామన్‌ రకానికి రూ.2,823 కోరితే రూ.1750, జొన్నకు రూ.2,939 ప్రతిపాదిస్తే రూ.2,430, మొక్కజొన్నకు రూ.2,474 కోరితేరూ.1,700 మాత్రమే ఇచ్చారని తెలిపారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం తాము కోరితే కేంద్రం పట్టించుకోలేదన్నారు. మిరప, పసుపు విషయంలో కూడా కేంద్రం సాయం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా కన్నా లక్ష్మీనారాయణ, జగన్‌, పవన్‌ విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రైతు సమస్యలపై అవగాహన లేకుండా జనసేన, వైకాపా నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్రం రైతులకు అన్యాయం చేస్తుంటే పవన్‌ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కావలిలో కన్నా లక్ష్మీనారాయణపై జరిగిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు.