హక్కుల కోసం నిలదీస్తాం

1
– టీఆర్‌ఎస్‌ ఎంపీలు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 22(జనంసాక్షి):రేపటి నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాలు హాట్‌హాట్‌గా సాగనున్నాయి. పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. అటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైనా కేంద్రాన్ని ప్రశ్నించేందుకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు సన్నద్ధమయ్యారు. కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈసారి సమావేశాలను హెచ్సీయూ విద్యార్థి వేముల రోహిత్‌ ఆత్మహత్య, జేఎన్యూ వివాదాలు తీవ్రంగా కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు సమావేశాలు సజావుగా సాగేందుకు మంత్రి వెంకయ్యనాయుడు ఇవాళ అఖిలపక్ష నేతలతో భేటీ కానున్నారు. ఈ నెల 16న కూడా ప్రధాని మోదీ ఇలాంటి సమావేశాన్ని నిర్వహించారు. రాజ్యసభ చైర్మన్‌ హవిూద్‌ అన్సారీ కూడా శుక్రవారం ఆయా పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో భేటీ అయ్యారు. మరోవైపు, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ సోమవారం పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. రోహిత్‌ ఆత్మహత్య, జేఎన్యూ అంశాలతోపాటు పఠాన్కోట్పై ఉగ్రదాడి, జీఎస్టీ బిల్లు ఆమోదం తదితర అంశాలు ఈ సమావేశాల్లో వాడివేడి చర్చకు దారి తీసే అవకాశాలున్నాయి. 62 చట్టసవరణ బిల్లులు, 12 ఆర్థిక అంశాలు పార్లమెంట్ముందుకు రానున్నాయి. అటు బడ్జెట్‌ సమావేశాల్లో ఎలాగైనా జీఎస్టీ బిల్లును ఆమోదించుకోవాలనే పట్టుదలతో కేంద్రం ఉన్నది. కానీ ఈ బిల్లుకు సంబంధించి తమ డిమాండ్లను నెరవేర్చనిదే మద్దతు తెలిపేదిలేదని కాంగ్రెస్‌ భీష్మిస్తున్నది.అటు తెలంగాణ ఎంపీలు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను లేవనెత్తడానికి సమాయత్తమవుతున్నారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులు, స్మార్ట్సిటీలు, జాతీయ రహదారులు తదితరాలపై ఇప్పటికే ఆయా మంత్రిత్వశాఖలకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు లిఖితపూర్వక సమాధానం కోసం ప్రశ్నలు పంపారు. ఈ ప్రశ్నలన్నింటికీ మంత్రిత్వశాఖ లిఖిత పూర్వక సమాధానం ఇవ్వనుంది. దీనికి తోడు అనుబంధ ప్రశ్నల ద్వారా మరికొంత సమాచారాన్ని సభ్యులు ఆశిస్తున్నారు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే 197, 377వ నిబంధన ప్రకారం వీటిపై చర్చ జరపాలని పట్టుబట్టే అవకాశముంది. ఇటీవల హైదరాబాద్‌ విమానాశ్రయంలో పలువురు విద్యార్థుల్ని అమెరికా విమానం ఎక్కకముందే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు నిలిపివేయడంపై ఎంపీ వినోద్‌ ప్రశ్న వేశారు. గడచిన రెండేండ్లలో తెలంగాణకు వివిధ జాతీయ రహదారుల నిర్మాణం కోసం వెచ్చించిన నిధుల గురించి కూడా ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఆ మంత్రిత్వశాఖ నుంచి వివరాలు కోరారు. గ్రావిూణ ఉపాధి హావిూ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు, విడుదల చేసిన మొత్తం, ఇప్పటివరకు అయిన ఖర్చు తదితరాలపై వివరాలను ఇవ్వాల్సిందిగా గ్రావిూణాభివృద్ధి మంత్రిత్వశాఖను ఎంపీ వినోద్కుమార్‌ కోరారు. సౌర విద్యుత్‌ ఉత్పత్తి పార్కుల అంశాన్ని కూడా ఎంపీ ప్రస్తావించనున్నారు. పోచంపల్లి చేనేత వస్త్రాలకు తగిన మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించేలా కేంద్రం చొరవ, నకిలీ ఉత్పత్తులను నివారించడానికి తీసుకుంటున్న చర్యల గురించి భువనగిరి ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ ప్రస్తావించనున్నారు. అటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యతో పాటు జేఎన్యూలో నెలకొన్న అసాధారణ పరిస్థితులు, హర్యానాలో జాట్‌ రిజర్వేషన్పై జరుగుతున్న ఆందోళన తదితరాలను విపక్షాలు వాడుకునే అవకాశం ఉంది. మరోవైపు ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల అంశాలను బలంగానే ప్రస్తావించే అవకాశం ఉంది.