హజ్‌ యాత్రికులకు శిక్షణ

అనంతపురం, జూన్‌ 27 : హజ్‌ యాత్రికుల శిక్షణా కార్యక్రమము స్థానిక కాలనీలోనిమ ఆజాద్‌ కమ్యూనిటీ హాలులో నిర్వహించారు. అనంతరపురం హజ్‌ సొసైటీ కన్వీనరు మౌలానా ముష్తాక్‌ అహమ్మద్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హజ్‌ కమిటీ ఛైర్మన్‌ సయ్యద్‌ ఖలీల్‌ వుద్దీన్‌, సిఈవో అబ్దుల్‌ హమీద్‌ హజ్‌ కమిటీ సభ్యులు మెహమ్మద్‌బేగ్‌ హజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మౌలానా ఫజులుల్‌ రెహమాన్‌, ఖాజీ ఇమాం షరీఫ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హజ్‌ కమిటీ ఛైర్మన్‌ మాట్లాడుతూ, 2011 సంవత్సరంనకు సంబంధించి రాష్ట్రం నుంచి హజ్‌ యాత్రకు బయలుదేరడానికి 17వేల మంది దరఖాస్తు చేసుకోగా అందులో 6వేల మందిదాకా మహిళలు, పురుషులు లాటరీ పద్దతి ద్వారా అధికారికంగా అర్హులుగా ఎంపికయ్యారన్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌, కర్నూలులో అలాగ అనంతపురంలో హజ్‌ ప్రాముఖ్యత గురించి, హజ్‌ యాత్ర సమయంలో పాటించవలసిన అంశాల గురించి ఇస్లామిక్‌ తర్పీద్‌ తదితర విషయాలపై శిక్షణా, అవగాహన కల్పించడం జరుగుతున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా నుంచి 300 మందిదాకా రాబోయే సెప్టెంబరులో హజ్‌ యాత్రకు బయలుదేరుతున్నారని అందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హజ్‌ యాత్రికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, రాయితీలు, సౌదీ అరేబియాలో హజ్‌ యాత్రికులు ఏ విధంగా ప్రవర్తించవలసిన విధి విధానాలను గురించి ప్రభుత్వ నిబంధనలు, నియమావళి, సూచనలు తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమాల్లో తెలపడం జరుగుతోందని స్పష్టం చేశారు. హజ్‌ యాత్రికులు చెల్లించవలసిన మిగులు రుసుం జులై 13వ తేదీలోగా ఎస్‌బిఐ అకౌంటులో జమ చేయాలని, హజ్‌ యాత్రకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వెబ్‌ సైట్‌ ద్వారా సేకరించుకొవచ్చునన్నారు.