హడలెత్తిస్తున్న ‘నిఫా’

– కేరళలో 15కు చేరిన నిఫా వైరస్‌ మరణాలు
– మరో ఇద్దరు వ్యక్తులకు చికిత్స అందిస్తున్న వైద్యులు
కోజికోడ్‌, మే31(జ‌నం సాక్షి) : నిఫా వైరస్‌ కేరళ వాసులను హడలెత్తిస్తోంది.. ఇప్పటికే పలువురు ఈ నిఫా వైరస్‌ వ్యాధి భారిన పడి మృతిచెందగా తాజాగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో నిఫా వైరస్‌ సోకి మరణించిన వారి సంఖ్య 15కు చేరింది. కేరళలోని కారాస్సెరీకి చెందిన 28ఏళ్ల అఖిల్‌ అనే వ్యక్తి ఈ వైరస్‌ బారిన పడి మరణించారు. అతడు కోజికోడ్‌ మెడికల్‌ కళాశాలలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారని అధికారులు వెల్లడించారు. అఖిల్‌ మరణంతో ఈ వైర్స్‌ మరణాల సంఖ్య పదిహేనుకు చేరిందని తెలిపారు. నిన్న నెల్లికోడ్‌ జిల్లాలో మధుసూదనన్‌(55) అనే వ్యక్తి నిఫా వైరస్‌ సోకి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మధుసూదనన్‌ కోజికోడ్‌ జిల్లా కోర్టులో సీనియర్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు వ్యక్తులకు కూడా నిఫా వైరస్‌ సోకడంతో కోజికోడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. వ్యాధి సోకిన వారికి దగ్గరగా ఉన్న దాదాపు 1353 మందిని అబ్సర్వేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. సోమవారం కోల్‌కతాలో సిమూ ప్రసాద్‌ అనే జవాను నిఫా వైరస్‌తో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన కేరళకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సెలవులకు స్వస్థలానికి వెళ్లిన జవానుకు నిఫా వైరస్‌ సోకినట్లు అనుమానిస్తున్నారు.