హరితహారంలో ఆదర్శంగా నిలుస్తున్న ఎడపల్లి పోలీసులు
ఎడపల్లి, జులై 31 ( జనంసాక్షి ) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారంలో భాగంగా ఎడపల్లి ఎస్ఐ ఆసిఫ్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలో విరివిగా మొక్కలు నాటుతున్నారు. సీపీ కార్తికేయ మిశ్రా ఆదేశాలతో ఎడపల్లి పోలీసులు హరితహారంలో చురుకుగా పాల్గొంటున్నారు. మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎడపల్లి ఎస్సై ఎండీ ఆసిఫ్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ సర్కారు ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో ప్రజలకు మరింత దగ్గరవ్వడం జరిగిందన్నారు. అయితే తెలంగాణ కు హరితహారంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలో మొక్కలు నాటుతున్నామని ఆయన తెలిపారు. హరితహారంలో భాగంగా జానకంపేట్ సిటీసీ కేంద్రంలో ఒక్కరోజే వేల మొక్కలు నాటడం జరిగిందన్నారు. అలాగే 3000 మొక్కలను ఇంటింటికి పంచడం జరిగిందన్నారు. ప్రతిఒక్కరు మొక్కలు విరివిగా నాటాలని ఆయన పిలునిచ్చారు. పచ్చదనంతోనే ప్రతి ఒక్కరి మనుగడ సాధ్యమని ఎస్సై ఎండీ ఆసిఫ్ జనంసాక్షి ద్వార ప్రజలను కోరారు.