హరితహారం అందరి బాధ్యత కావాలి

జనగామ,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో భాగంగా అందరూ పాల్గొని బాధ్యతగా మొక్కలు నాటాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అడవుల విస్తీర్ణం తగ్గడంతో వర్షాలు సమృద్ధిగా కురువడం లేదన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అందరూ మొక్కలు నాటడమే మార్గమన్నారు. రైతులు వర్షంపై అధారపడి పంటలు పండిస్తారని వానలు కురవాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని తెలిపారు. జిల్లాను హరితహారంలో ముందజాలో ఉండేటట్లు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో మొక్కలు నాటాలని కోరారు. ప్రతీ గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు నిర్మించేలా అధికారులు ప్రజలకు చైతన్యవంతుల్ని చేయాలన్నారు. ఐదో విడత హరితహారంలో భాగంగా శుక్రవారం జనగామ విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో డీఈవో ఎస్‌ యాదయ్య మొక్కలు నాటారు. కార్యాలయంలో పలు విభాగాల అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షణకు ట్రీగార్డ్స్‌ ఏర్పాటుచేశారు.