హరితహారం ప్రతి ఒక్కరిదీ
ఆదిలాబాద్,జూన్25(జనం సాక్షి ): హరితహారం పథకంలో భాగంగా జిల్లాలో పెద్దఎత్తున మొక్కలను నాటాలని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పెంచుతున్న నర్సరీని, హార్టికల్చర్‌లో ఐటీడీఏ ద్వారా పెంచుతున్న మొక్కలను ఉపయోగించుకోవాలని అన్నారు. నర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో కొండమామిడి, సోమ, మలినారా, కానుగ, నీలగిరి, టేకు, నల్లమద్ది, అల్లనేరేడు, సీతాఫలం, గోరంట, ఉసిరి, తెల్లమద్ది వంటి మొక్కలను పెంచుతున్నట్లు కలెక్టర్‌కు వివరించారు. ఇదిలావుంటే జిల్లాలోని ప్రతి ఆలయంలోనూ హరితహారం కింద భారీగా మొక్కలు నాటాలని దేవాదాయశాఖ సహాయ కమిషనర్ అన్నారు. జూలై మొదటివారంలో ప్రారంభం కానున్న హరితహారంలో భాగంగా ప్రతీ ఆలయంలో కనీసం వంద మొక్కలకు తగ్గకుండా నాటి వాటి సంరక్షణ బాధ్యతను ఆలయ నిర్వాహకులు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ పథకాన్ని ప్రారంభించిందని, దానికి ఆలయ నిర్వాహకులు సహకరించాలని కోరారు. ఈ ఏడాది జిల్లాలోని ఆలయాల్లో పది వేల మొక్కలు నాటడానికి నిర్ణయించామని అన్నారు. జిల్లాలోని ఆలయాలకు ఉన్న భూములపై ఎలాంటి సమస్యలున్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. వర్షాకాలంలో ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేలా చూడాలన్నారు.