హరిత కరీంనగర్ గా తీర్చిదిద్దుతాం

* రెండు లక్షల పదివేల మొక్కలను పెంచుతున్నాం.

* హరితహారం కోసం 10% ప్రత్యేక గ్రీన్ బడ్జెట్.

* కరీంనగర్ మేయర్ సునీల్ రావు

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :
హరితహారం లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి హరిత కరీంనగర్ గా తీర్చిదిద్దుకుందామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 11 నర్సరీలను మంగళవారం రోజు మేయర్ సునీల్ రావు, కమిషనర్ సేవా ఇస్లావత్ అధికారులతో కలిసి సందర్శించారు. తొలుత ఎనిమిదవ డివిజన్ పరిధిలోని అలుగునూర్ ఎల్ఎండి వద్ద ఏర్పాటు చేసిన నర్సరీ తో పాటు ఎస్సార్ కళాశాల ఆవరణలో మరియు చింతకుంట సెంటర్ లో ఏర్పాటు చేసిన నర్సరీలను సందర్శించి పరిశీలించారు. ఈ విడత హరితహారంలో పెద్ద సంఖ్యలో నాటే మొక్కలు సంరక్షణ చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని కరీంనగర్ నగరపాలక సంస్థలో గత విడుదలగా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి నగరంలో ప్రకృతి వనాలు నర్సరీలను గొప్పగా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. గత హరితహారం లో నగరంలో మొక్కలు నాటేందుకు ఇతర ప్రాంతాల నుండి మొక్కలు తెచ్చి నాటడం జరిగిందని అన్నారు. నగరపాలక సంస్థ స్వయంగా గ్రీన్ బడ్జెట్ సహకారంతో నగరంలో 11 నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచడం జరిగిందని స్పష్టం చేశారు. వివిధ రకాల మొక్కలతోపాటు ఔషధ పూల పండ్ల మొక్కలను నర్సరీలో పెంచామని తెలిపారు. డివిజన్ల వారీగా నగర ప్రజలకు ఇంటింటికి మొక్కలను పంపిణీ చేసేందుకు లక్ష పదివేల పండ్ల మొక్కలు, లక్ష పూల మొక్కలు , ఔషధ మొక్కలను అందుబాటులో ఉంచడం జరిగిందని స్పష్టం చేశారు. డివిజన్లో వారీగా కార్పొరేటర్ల సహకారంతో ప్రజలకు త్వరలోనే పూల పనుల మొక్కలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం కార్పోరేటర్లు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజల్లో అవగహన కల్పించాలని సూచించారు. నగరంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు ఏపుగా ఎదిగి చిట్టడవులను తలపిస్తున్నాయన్నారు. నగరంలో ప్రకృతి వనాలు నర్సరీలను గొప్పగా ఏర్పాటు చేశామన్నారు. నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన నగర ప్రకృతి వనాలు ఏపుగా ఎదిగి నగరం మధ్య చిట్టడవులను తలపిస్తున్నాయన్నారు. రాబోయే 10 రోజుల్లో ప్రతి ఇంటికి పూల మొక్కలు పండ్ల మొక్కలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగర వాసులు ఈ మొక్కలను తమ తమ ఇంటి ఆవరణలో నాటి సంరక్షించుకోవాలని సూచించారు. అంతే కాకుండా నగర పాలకసంస్థ ఆధ్వర్యంలో వీధుల్లో నాటిన మొక్కలను సైతం సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. నగర పాలక సంస్థ కొత్త చట్టం ప్రకారం గ్రీన్ బడ్జెట్ కెటాయించిన 10 శాతం డబ్బులు ప్రజలవేనని డబ్బు వృదా కాకుండా ప్రజలు చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఉపయోగపడుతాయని నగరంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. కార్పోరేటర్లు సైతం బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని దీని పై తమతమ డివిజన్ వాసుల్లో అవగహన కల్పించి నగరాన్ని హరిత కరీంనగర్ గా మార్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, ఈ ఈ కిష్టప్ప, డిఈ వెంకటేశ్వర్లు, హరితహారం ఇంచార్జ్ నరేందర్, తదితరులు పాల్గొన్నారు.