‘హస్తా’నికే అత్యధిక సీట్లు
‘జనంసాక్షి’ సర్వేలో నిజం కాబోతున్నాయి..!!
ప్రధాన సంస్థలన్నీ ఇదే విషయాన్ని వెల్లడిరచాయి
తెలంగాణలో అధికార మార్పిడికి ‘ఓటర్ల’ మొగ్గు
కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి.. గజ్వేల్‌లో ఎదురీత..!
ఎక్కువ నియోజకవర్గాల్లో ద్విముఖ.. కొన్నిచోట్ల త్రిముఖ పోటీ
ఓటింగ్ శాతంలోనూ గణనీయంగా వృద్దిచెందిన కాంగ్రెస్ పార్టీ
క్షేత్రస్థాయిలో సర్వేలోకి వెళ్లి ‘జనంసాక్షి’ సేకరించిన వివరాలు వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయి. నిక్కచ్చితనంతో, నిజాయితీతో, అంకితభావంతో ఓటర్ల నాడీని పట్టుకున్న ‘జనంసాక్షి’ ఎలాంటి బెదురూ.. బెరుకూ లేకుండా వెల్లడిరచిన సర్వే ఫలితాల పట్ల నిపుణులు, మేధావులు ఏకీభవిస్తున్నారు. నియోజకవర్గాలవారీగా అధికార బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురైన వ్యతిరేకత.. హస్తం పార్టీకి వ్యక్తమైన సానుకూలతలు ‘శాంపిల్స్’లో నిక్షిప్తం చేసి నవంబర్ 28న సోషల్ మీడియా వేదికగా ‘జనంసాక్షి’ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నా… తాజాగా వెల్లడైన పలు ప్రధాన సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ కూడా ‘జనంసాక్షి’కి దగ్గరగా ఉండటం గమనార్హం. అధికార మార్పిడివైపే ఓటర్లు మొగ్గుచూపినట్టు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడగా.. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ బ్యూరో, నవంబర్ 30 (జనంసాక్షి) :తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రాబోతున్నట్లు పలు సర్వే సంస్థలు వెల్లడిరచాయి. ప్రధానమైన ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చే అవకాశం ఉందని తేల్చాయి. అధికార బిఆర్‌ఎస్ రెండో స్థానానికి పరిమితం కావడంతో పాటు, కామారెడ్డిలో కెసిఆర్ ఓడిపోతున్నట్లుగా తేల్చాయి. కేటీఆర్, హరీశ్‌రావు తమ ఆధిక్యతను ఎప్పటిలాగే చాటుకోనున్నట్టు తెలుస్తోంది. కొంచెం అటుఇటుగా అన్ని సంస్థలు కాంగ్రెస్‌కు సానుకూలత ఉన్నట్లు సర్వే ఫలితాలను వెల్లడిరచాయి. కాంగ్రెస్ పార్టీకి 49 నుంచి 65 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని తేలింది. బీఆర్‌ఎస్‌కు 38 నుంచి 54 సీట్లు వచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ కూటమికి మూడు నుంచి 13 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇతరులు 5 నుంచి 9 స్తానాల్లో గెలుస్తారు. ఇతరుల్లో మజ్లిస్ పార్టీ కూడా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 40.7 శాతం ఓట్లు వస్తాయి. అంటే గత ఎన్నికలతో ఓటింగ్ పర్సంటేజీ దాదాపుగా 12.4 శాతం పెరుగుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 28.3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. భారత రాష్ట్ర సమితికి ఏకంగా 8.1 శాతం ఓట్లు తగ్గబోతున్నాయి. ఆ పార్టీకి 38.8 శాతం వరకూ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి 46.9 శాతం ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం పరంగా భారీగా లబ్ది పొందుతోంది. గత ఎన్నికల్లో కేవలం ఏడు శాతం ఓట్లే ఆ పార్టీకి వచ్చాయి. కనీ ఈ సారి మాత్రం ఏకంగా 17శాతం ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడయింది. ఏకంగా 9 శాతం ఓట్లు బీజేపీకి పెరుగుతాయి. ఇతర పార్టీలకు వచ్చే ఓట్ల శాతం ఈ సారి బాగా తగ్గిపోయింది. గత ఎన్నికల్లో ఇతరులకు 17.8 శాతం ఓట్లు రాగా ఈ సారి ఆ శాతం కేవలం 4.5 శాతానికి పడిపోతుందని తేలింది.
వ్యతిరేకతే ప్రధాన కారణం..?
కాంగ్రెస్ పార్టీకి 57 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉన్నట్టు పలు పోల్స్ వెల్లడిస్తున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే 38 సీట్లు ఎక్కువ. బీఆర్‌ఎస్ పార్టీ 42 సీట్లను కోల్పోయి 46 దగ్గర స్థిరపడుతుంది. బీజేపీ ఒకటి నుంచి ఎనిమిది స్థానాలకు పెరుగుతుంది. అదర్స్‌కు ఏడు సీట్లే వస్తాయి. ఆ ఏడూ మజ్లిస్ కే వచ్చే చాన్స్ ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పదేళ్లుగా అధికారంలో ఉంది. ఈ సందర్భంగా అధికార వ్యతిరేకత ఉందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడయింది. ఈ అధికార వ్యతిరేకత తీవ్రంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి 67 నుంచి 79 సీట్ల వరకూ లభించే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ పరిస్థితి 29 నుంచి 41 సీట్లకు పరిమితమవ్వొచ్చు. బీజేపీకి నాలుగు నుంచి ఎనిమిది సీట్లు, ఇతరులకు మూడు నుంచి ఏడు సీట్లు వరకూ వస్తాయి. అంటే అధికార వ్యతిరేకత బాగా ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి ఊహించనంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తమకు ప్రజల్లో సానుకూలత ఉందని నమ్మకంతో ఉంది. ఎగ్జిట్ పోల్స్ లో అలాంటి వాతావరణ కనిపించకపోయినా.. ఓటర్లు చివరి క్షణంలో మనసు మార్చుకుని ఉంటే తెలంగాణలో బీఆర్‌ఎస్ సర్కార్ మరోసారి ఏర్పడుతుందని అంచనా. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 52 స్థానాలు వస్తాయి. బీఆర్‌ఎస్ పార్టీకి 54 నుంచి 66 స్థానాలు వస్తాయని అంచనా. బీజేపీకి ఏడు నుంచి 11 సీట్లు లభిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీఆర్‌ఎస్ శ్రేణుల్లో దడ
ఎగ్జిట్ పోల్స్‌తో బీఆర్‌ఎస్ శ్రేణుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఏకంగా బీఆర్‌ఎస్ బాస్ సీఎం కేసీఆర్‌కే ఓటమి తప్పదని ఆరా మస్తాన్ సర్వే వెల్లడిరచింది. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మతంగా తీసుకున్న కామారెడ్డి నియోజకవర్గంలో ఓటమి తప్పదని సర్వేలో వెల్లడైంది. అలాగే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే వెల్లడిరచింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెంటకరమణా రెడ్డి గెలిచే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు గజ్వేల్‌లో కేసీఆర్ స్వల్ప మెజారిటీతో గెలుపొందుతారని ఆరా మస్తాన్ సర్వే సంస్థ తెలపడంతో బీఆర్‌ఎస్ పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బర్రెలక్కకు 15 వేల ఓట్లు రావచ్చని ఆరా మస్తాన్ సర్వే పేర్కొంది. అయితే ఈమె గెలవకపోయినా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలిచే అవకాశం ఉందని ఆరా సర్వే వెల్లడిరచింది.
70కి పైగా స్థానాల్లో గెలుస్తాం
ఎగ్జిట్ పోల్స్‌లో శాస్త్రీయత ఉందనుకోవడం లేదు
కార్యకర్తలు ఏమాత్రం ఆందోళన చెందవద్దు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
గత ఎన్నికల్లోనూ ఇలాగే పోల్స్ ఇచ్చారని వ్యాఖ్య
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసి కంగారు పడాల్సిన పని లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మళ్లీ అధికారం బీఆర్‌ఎస్ పార్టీదేనని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్‌లో కేటీఆర్ విూడియాతో మాట్లాడారు. ‘ఈరకమైన ఎగ్జిట్ పోల్స్‌ను గతంలోనూ చూశాం. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని నిరూపించడం మాకు కొత్తేవిూ కాదు. డిసెంబర్ 3న 70కి పైగా స్థానాలతో విజయం సాధిస్తాం. హ్యాట్రిక్ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని విూడియా సంస్థలు సర్వేలు చేయకుండా.. ఏదో 200 మందిని అడిగినట్టు చేసి.. దాన్ని గొప్పగా చేసి చూపిస్తారు. గతంలో 5 విూడియా సంస్థలు సర్వేలు చేస్తే.. అందులో ఒక్కటే నిజమైంది.’ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు ఇంకా లైన్‌లో ఉండి ఓట్లు వేస్తూనే ఉన్నారని.. అప్పుడే ఎగ్జిట్ పోల్స్ వెల్లడిరచడటమేంటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అస్సలు ఏ లాజిక్‌తో ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందని అన్నారు. ఒకవేళ డిసెంబర్ 3న ఎగ్జిట్ పోల్స్ తప్పు అయితే.. తప్పు జరిగిందని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతారా? అని ఎగ్జిట్ పోల్స్ ప్రచురించిన విూడియా సంస్థలను కెటిఆర్ ప్రశ్నించారు. ఎవ్వరూ కన్ఫ్యూజన్ కావద్దని.. వందకు 100 శాతం అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. గత 90 రోజులుగా కష్టపడ్డ మా కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా గంట, గంటన్నర సేపు పోలింగ్ జరిగేది ఉందని.. 70కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. 70కి పైగా స్థానాల్లో గెలుస్తాం అని ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, హ్యాట్రిక్ కొడతామని కేటీఆర్ తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారుపడాల్సిన అవసరం లేదని, ఎగ్జిట్ పోల్స్ తప్పయితే డిసెంబర్ 3 తర్వాత క్షమాపణలు చెబుతారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.’మళ్లీ అధికారం మాదే.. హ్యాట్రిక్ కొడతాం. 2018 తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ తప్పని తేలాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
సంబరాలు చేసుకోండి
కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్‌రెడ్డి పిలుపు
గెలుపు మాదే.. బీఆర్‌ఎస్‌కు 25 సీట్లు మించి రావు
డిసెంబర్ 9న కాంగ్రెస్ సర్కారు కొలువుదీరుతుందని ధీమా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఇదే విషయం వెల్లడిరచాయని అన్నారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు. గురువారం ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్‌పై హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పారు. కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడగొడుతున్నామన్నారు. బీఆర్‌ఎస్‌కు 25 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. ఇన్నాళ్లూ అధికారమే శాశ్వతమని కేసీఆర్ నమ్మారని, తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ 3న శ్రీకాంతాచారి తుదిశ్వాస విడిచారని, అదే రోజున ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగానికి ఎన్నికల ఫలితాలకు ఓ లింక్ ఉందని చెప్పారు. నేడు తెలంగాణ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు మెజారిటీని కట్టబెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ రబ్బిస్ అని కేటీఆర్ పేర్కొన్న వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. అవి నిజమైతే కేటీఆర్ క్షమాపణలు చెబుతారా? అని రేవంత్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, కెసిఆర్ అహంకారంపై ప్రజలు తిరుగుబాటు చేసారని అన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టాక ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తుందని, అన్నివర్గాలను దరికి చేరుస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యం నెలకొల్పుతామని అన్నారు. ఇదిలావుంటే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ 90 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ‘నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుంది. ఎర్రబెల్లి ఓటమి ఖాయం. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రజలకు నమ్మకం కుదిరింది. కార్యకర్తల పోరాటం వృథా కాలేదు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఎన్టీఆర్ లాంటి వారే ఓడారు. కేసీఆర్ ఓ లెక్కా. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోబోతున్నారు. కాంగ్రెస్ మార్క్ పాలన చూపిస్తాం’ అని తెలిపారు.